Manmohan Singh : మన్మోహన్ సింగ్ కన్నుమూత.. 7 రోజులు జాతీయ సంతాప దినాలు
దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు. భారత రాజకీయాలలో నిష్ణాతుడు. ప్రజా సేవలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేశాడు.

Manmohan Singhs Demise
Manmohan Singh : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ వయసు 92 సంవత్సరాలు.
2004 నుంచి 2014 వరకు పదేళ్లు ప్రధాని వ్యవహరించారు. యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలను నడిపించారు. 13వ భారత ప్రధానిగా వ్యవహరించారు. దేశంలోని ప్రఖ్యాత ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరుపొందారు. ఆర్థిక సంస్థరణల రూపకర్తగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు. 1982-85 మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా వ్యవహరించారు.
మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం సంతాపం తెలిపింది. మన్మోహన్ సింగ్ మృతితో.. శుక్రవారం జరగాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ రద్దు చేశారు. 7 రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్రం. ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం.
మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందన్నారు. మన్మోహన్ సింగ్ లేని లోటును ఎవరూ పూడ్చలేనిదన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
జేపీ నడ్డా..
మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్ మరణం దేశానికి తీరని లోటు. దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు. భారత రాజకీయాలలో నిష్ణాతుడు. ప్రజా సేవలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేశాడు. పార్టీ శ్రేణులకు అతీతంగా ఆయన నాయకత్వం అభిమానాన్ని, గౌరవాన్ని పొందింది. మన్మోహన్ సింగ్ వారసత్వం దేశ నిర్మాణ సాధనలో తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మన్మోహన్ కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి.
రాహుల్ గాంధీ..
భారతదేశాన్ని అపారమైన జ్ఞాన సమగ్రతతో ముందుకు నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఆయన వినయం, ఆర్థికశాస్త్రంపై లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయి. నేను ఒక గురువు, మార్గదర్శిని కోల్పోయాను. ఆయనను అభిమానించే లక్షలాది మంది ఆయనను అత్యంత గర్వంగా గుర్తుంచుకుంటారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
‘ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరనే వార్త బాధాకరం. మేధావి, రాజనీతిజ్ఞుడు, వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతిరూపం మన్మోహన్ సింగ్. 1991లో ఆర్థికమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పటి నుంచి ప్రధాని బాధ్యతలు నిర్వర్తించే వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారు. కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్ర్యం నుంచి బయటపడేశారు. ఆయన మృతి దేశానికి తీరనిలోటు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి, సన్నిహితులు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నా’.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
మన్మోహన్ సింగ్ లెజెండ్. దేశం ఒక గొప్ప బిడ్డను కోల్పోయింది. గొప్ప ఆర్థికవేత్త, నాయకుడు, సంస్కర్త, అన్నింటికంటే గొప్ప మానవతావాది మన్మోహన్ సింగ్. సామాన్యుడి కోణంలో ఆలోచించి మన్మోహన్ సింగ్ నిర్ణయాలు తీసుకునే వారు.
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్..
”భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. కష్ట సమయాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంలో మన్మోహన్ కీలక పాత్ర పోషించారు. భారతదేశ ప్రగతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి”.
మాజీ ప్రధాని దేవెగౌడ సంతాపం..
”మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణవార్త చాలా బాధాకరం. మన్మోహన్ మంచి సహనశీలి, తెలివైన ఆర్థికవేత్త. నేను గౌరవించే సహోద్యోగి. భారతదేశ ఆర్థిక భవిష్యత్తును మార్చిన వ్యక్తిగా చరిత్రలో చిరస్మరణీయుడు”.
అరవింద్ కేజ్రీవాల్..
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు. ఆయన పాండిత్యం, సరళత లక్షణాలను పదాలలో చెప్పలేము. ఆయన కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి.
గౌతమ్ అదానీ…
‘డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. భారత దేశాన్ని పునర్నిర్మించడంలో, 1991 సంస్కరణలలో మన్మోహన్ కీలక పాత్రను చరిత్ర ఎప్పటికీ గౌరవిస్తుంది. మృదువుగా మాట్లాడి, తన చర్యల ద్వారా పురోగతిని సాధించిన అరుదైన నాయకుడు. డాక్టర్ సింగ్ జీవితం నాయకత్వం, వినయం, దేశానికి సేవ చేయడంలో మాస్టర్ క్లాస్‌గా మిగిలిపోయింది. రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది.’
Also Read : ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానం..