Manmohan Singh : ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానం..
దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు.

Former PM Manmohan Singh
Manmohan Singh : మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ 1932లో సెప్టెంబర్ 26న వెస్ట్ పంజాబ్ లోని గాహ్ లో జన్మించారు. పంజాబ్ విశ్వ విద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా అందుకున్నారు. ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రిగా పని చేశారు.
దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు. రాజకీయ, ఆర్థికవేత్తగా సేవలు అందించారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, నరేంద్ర మోదీ తర్వాత దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు. మొదటి సిక్కు ప్రధాన మంత్రి కూడా ఆయనే.
2004 నుంచి 2014 వరకు పదేళ్లు దేశ ప్రధానిగా ఆయన సేవలు అందించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో ఆర్బీఐ గవర్నర్ హోదాలో కీలక పాత్ర పోషించారు. 1991 అక్టోబర్ 1 నుండి 2019 జూన్ 14 వరకు ఐదు సార్లు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. 2019 ఆగస్టు 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారాయన.
దేశ విభజన తర్వాత మన్మోహన్ కుటుంబం ఇండియాలోనే సెటిల్ అయ్యింది. డిగ్రీ పట్టా పొందిన తర్వాత సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో లెక్చరర్ గా పని చేశారు. అనంతరం ఆక్స్ ఫర్డ్ నుంచి ఎకనామిక్స్ విభాగంలో డాక్టరేట్ పొందిన మన్మోహన్ సింగ్.. 1966 నుంచి 69 వరకు ఐక్యరాజ్యసమితిలో పని చేశారు. లలిత్ నారాయణ్ మిశ్రా ఆయనను వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో సలహాదారుగా నియమించడంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
1972 నుంచి 76 మధ్య కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సేవలు అందించారు మన్మోహన్ సింగ్. 1982 నుంచి 85 మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పని చేశారు. అనంతరం ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ గా పని చేశారు. 1991లో భారత దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్నారు. 13వ భారత ప్రధానిగా మన్మోహన్ సేవలు అందించారు.