Jagdeep Dhankhar : ఎమ్మెల్యే పెన్షన్ కోసం అప్లై చేసిన మాజీ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌కడ్.. ఆయన అప్పుడు ఏ పార్టీ నుంచి గెలిచారు? ఎంత పెన్షన్ వస్తుంది?
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ (Jagdeep Dhankhar) ఎమ్మెల్యే పెన్షన్ కోసం అప్లై చేశారు. ఆయన 1993- 1998 మధ్య రాజస్థాన్ అసెంబ్లీలో

Jagdeep Dhankhar
Jagdeep Dhankhar : మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ఎమ్మెల్యే పెన్షన్ కోసం అప్లై చేశారు. ఆయన 1993- 1998 మధ్య రాజస్థాన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు పెన్షన్ పునరుద్ధరించాలని అప్లికేషన్ పెట్టారు. ఆయన దరఖాస్తును అసెంబ్లీ ధ్రువీకరించింది. అయితే, ఆయన ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారు అనే ఆసక్తి నెలకొంది.
ధన్‌కడ్ కెరీర్..
74 ఏళ్ల ధన్‌కడ్ తొలిసారి 1991 నుంచి 1993 వరకు రాజస్థాన్ లోని ఝుంఝును లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. జనతాదళ్ నుంచి ఎన్నికైన ఆయన అప్పటి చంద్రశేఖర్ ప్రభుత్వంలో సహాయమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1993లో లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. వెంటనే రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ కాలానికి సంబంధించే ఇప్పుడు పెన్షన్ అప్లికేషన్ పెట్టారు.
2003లో బీజేపీలో చేరిక ..
జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ధన్ కడ్ ఆ తర్వాత 2003లో బీజేపీలో చేరారు. 2008 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాంపెయిన్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2016లో బీజేపీలో లీగల్ సెల్ కు నేతృత్వం వహించారు. ఆ తర్వాత 2019 జూలై 20న పశ్చిమబెంగాల్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసినప్పుడు జూలై 17, 2022న పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. 2022 ఆగస్ట్ 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ కడ్.. ఈ ఏడాది ఆగస్ట్ 11న పార్లమెంట్ సమావేశాల మొదటి రోజే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలను చూపుతూ సడన్ గా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో విబేధాల వల్ల రాజీనామా చేసినట్టు ప్రచారం జరిగింది.
ఎంత పెన్షన్ వస్తుంది?
జగదీప్ ధన్ కడ్ కు ఎంత పెన్షన్ వస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంటుంది. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినందుకు రూ.35,000 పెన్షన్ వస్తుంది. 70 ఏళ్ల పైబడిన వారికి అదనంగా 20 శాతం ఇస్తారు. అంటే సుమారు రూ.42,000 పెన్షన్ వస్తుంది. ఒకసారి ఎంపీగా పనిచేసినందుకు ఆయన రూ.45,000 పెన్షన్ కు అర్హులు. ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక ఉప రాష్ట్రపతిగా పనిచేసినందుకు ఆయనకు నెలకు రూ.2లక్షల పెన్షన్ వస్తుంది. టైప్ 8 బంగ్లా ఇస్తారు. ఒక పర్సనల్ సెక్రటరీ, ఒక అడిషనల్ పర్సనల్ సెక్రటరీ, ఒక పర్సనల్ అసిస్టెంట్, ఒక ఫిజీషియన్, ఒక నర్సింగ్ ఆఫీసర్, నలుగురు అటెండెంట్స్ ఉంటారు.