Gautam Adani : నువ్వు దేవుడు సామీ..! కొడుకు పెళ్లి వేళ గౌతమ్ అదానీ రూ.10వేల కోట్ల విరాళం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన అదానీ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Gautam Adani : అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన గొప్ప మనసు చాటుకున్నారు. కొడుకు పెళ్లి వేళ తన ఉదారతను చాటుకున్నారు. సమాజ సేవలో భాగంగా ఏకంగా 10 వేల కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు అదానీ. ఈ డబ్బుని పలు సేవా కార్యక్రమాల కోసం ఆయన వెచ్చిస్తారట. కొడుకు పెళ్లికి 10 లక్షలు మాత్రమే ఖర్చు చేసిన అదానీ.. సేవా కార్యక్రమాల కోసం 10వేల కోట్లు విరాళంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం.
కుమారుడికి పెళ్లి కానుకగా.. సామాన్యులకు ఉపయోగపడేలా పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వాలని అదానీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విరాళాన్ని ఆరోగ్య సంరక్షణకు, విద్యకు, నైపుణ్యాభివృద్ధికి వినియోగిస్తారని తెలుస్తోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రపంచ స్థాయి ఆసుపత్రుల్లో వైద్యం, టాప్ స్కూళ్లలో విద్య, నైపుణ్యాలు అందించడంపై దృష్టి సారిస్తారట.
కుమారుడి పెళ్లికి రెండు రోజుల ముందు అదానీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అదే మంగల్ సేవ. దీని కింద ప్రతి సంవత్సరం 500 మంది దివ్యాంగ మహిళలకు వారి పెళ్లి నిమిత్తం రూ. 10 లక్షల చొప్పున అందించనున్నట్లు ప్రకటించారు.
Also Read : రతన్ టాటా వీలునామాలో షాకింగ్ పేరు? ఎవరీ మోహిని మోహన్ దత్తా.. ఈ మిస్టరీ మ్యాన్‌కు రూ. 500 కోట్లు రాసిచ్చాడు!
చెప్పినట్లుగానే.. గౌతమ్ అదానీ తన కుమారుడి పెళ్లిని ఎంతో నిరాడంబరంగా నిర్వహించారు. పెళ్లికి పెద్దగా ఖర్చు చేయలేదు. కానీ, సేవా కార్యక్రమాల కోసం భారీగా విరాళం ప్రకటించి అందరి మన్ననలు పొందారు. మహా కుంభమేళా పర్యటనలో గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. తన కుమారుడి వివాహాన్ని అత్యంత సాధారణంగా, సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పారు.
తద్వారా తన కొడుకు జీత్ అదానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుందనే పుకార్లకు, ఊహాగానాలకు ఆయన తెరదించారు. తన కొడుకు పెళ్లికి ఇంటర్నేషనల్ స్టార్లు వస్తారన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.
బిలియనీర్ పారిశ్రామికవేత్త అయిన అదానీ.. తన కొడుకు పెళ్లిని సింపుల్‌గా నిర్వహించడమే కాకుండా 10వేల కోట్లు సోషల్ డొనేషన్ చేయడం విశేషం. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన అదానీ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
గౌతమ్ అదానీ చిన్న కొడుకు జీత్ అదానీ – దివా జైమిన్ షాల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. గుజరాతీ సంప్రదాయంలో వీరి వివాహం జరిపించారు. అహ్మదాబాద్‌లో అతి కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. జీత్ అదానీ- దివా షాల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.