Microsoft Outage: మైక్రోసాప్ట్ సేవలకు అంతరాయం.. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు, విమానయాన, టెలీకాం రంగాలపై తీవ్ర ప్రభావం

మైక్రోసాప్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Microsoft Outage: మైక్రోసాప్ట్ సేవలకు అంతరాయం.. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు, విమానయాన, టెలీకాం రంగాలపై తీవ్ర ప్రభావం

Microsoft service outage

Microsoft service outage : ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియాసహా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సేవలు నిలిచిపోగా.. అమెరికాలో ఎమర్జెన్సీ సేవల నెంబర్ 911పై ప్రభావం పడింది. భారత్‌లో విమాన, ఐటీ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీనికితోడు ప్రసారాలు జరుగుతుండగా స్కై న్యూస్ మధ్యలో నిలిచిపోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ తదితర విమాన సంస్థల సేవలకు విఘాతం ఏర్పడింది. మైక్రోసాప్ట్ సేవల్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అత్యధికంగా ఆస్ట్రేలియాలో వివిధ రంగాలు ప్రభావితమయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియాలో పలు న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి.

Also Read : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కొత్తరకం మొక్కను గుర్తించిన పరిశోధకులు.. దానిపేరు ఏమిటంటే?

క్రౌడ్ స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ రకమైన సమస్య ఎదురవుతున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాప్ట్ 365 యాప్స్, సర్వీస్సుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తున్నామని పోస్టు చేసింది. ఈ ప్రయత్నంలో పురోగతి కనిపిస్తోందని తెలిపింది. అయితే, ఈ సమస్య పరిష్కారానికి 5 నుంచి 10 గంటల సమయం పట్టవచ్చని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాప్ట్ విండోస్ వినియోగదారులు ఆపరేటింగ్ సిస్టమ్ లో లోపాలను ఎదుర్కొంటున్నారు. మిలియన్ల మంది విండోస్ యూజర్లు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఎర్రర్ అని వస్తుంది. దీని కారణంగా సిస్టమ్ లు అకస్మాత్తుగా షెడ్ డౌన్ కానీ, రీస్టార్ట్ అవుతున్నాయి. యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుపైనా ప్రభావం
మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవల్లో సాంకేతిక సమస్య ప్రభావం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుపైనా పడింది. ఇప్పటివరకు 35 విమాన సర్వీసులను ఎయిర్‌పోర్టు అధికారులు
రద్దు చేశారు. ఎయిర్‌పోర్టులో డిస్‌ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ బోర్డులు ఏర్పాటు చేశారు.

Also Read : తాడిపత్రి మున్సిపాలిటీలో ఆసక్తికర దృశ్యం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!

మైక్రోసాప్ట్ అధికారులతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ అధికారుల నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైక్రోసాప్ట్, దాని భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. అంతరాయానికి కారణం కనుగొన్నారని, సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) నెట్‌వర్క్‌పై ప్రభావం చూపలేదని అన్నారు. మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య ప్రభావం SBI పై లేదని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు.

మైక్రోసాఫ్ట్ సర్వర్లు డౌన్ కావడంతో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌పై కూడా ప్రభావం చూపింది. నెదర్లాండ్స్‌లో విమాన సర్వీసులు అంతరాయం ఏర్పడింది.
మైక్రోసాప్ట్ సర్వర్ డౌన్ కారణంగా అమెరికాలో 200 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేయబడ్డాయి.
జర్మనీలో బ్యాంకింగ్, టెలికాం, ఎయిర్ లైన్స్ సేవలు నిలిచిపోయాయి.
దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద బ్యాంక్ కాపిటెక్ కూడా ఈ సమస్యతో ప్రభావితమైంది.
ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన సింగపూర్ లోని చాంగి విమానాశ్రయం కూడా ప్రభావితమైంది. బ్రిటన్, జర్మనీలోని ఆసుపత్రులు కూడా ప్రభావితమయ్యాయి.

మైక్రోసాప్ట్ సర్వర్ డౌన్ కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ప్రభావితమైన దేశాల్లో అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి.
విమానాశ్రయం, రైల్వే, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, టీవీ ఛానెల్స్, ఆన్ లైన్ దుకాణాలు, ఆసుపత్రులు, ఐటీ రంగాల్లో మైక్రోసాప్ట్ సర్వర్ డౌన్ ప్రభావం ఎక్కువగా ఉంది.