Electric Vehicles : ఎలక్ట్రిక్​ వాహన కొనుగోలుదారులకు గుడ్​న్యూస్​

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు కేంద్ర శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీని వలన వాహనదారులకు రూ. 1000 వరకు ఆదా అవుతుందని ఆటో మొబైల్ డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది.

Electric Vehicles : ఎలక్ట్రిక్​ వాహన కొనుగోలుదారులకు గుడ్​న్యూస్​

Electric Vehicles

Updated On : August 5, 2021 / 3:54 PM IST

Electric Vehicles  : డీజిల్, పెట్రోల్ వలన కాలుష్యం పెరిగిపోతుంది.. మరోవైపు ఇంధన ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు కూడా వినియోగాదారుల అభిరుచికి తగిన విధంగా వాహనాలను తయారు చేస్తున్నాయి. ఇంధన వాహనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీచేసింది. ఎలక్ట్రిక్​ వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్ల జారీకి కూడా ఎలాంటి ఫీజు వసూలు చేయరని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఈ–స్కూటర్​ లేదా బైక్ కొనుగోళ్లకు అయ్యే ఖర్చు కనీసం రూ. 1000 తగ్గుతుందని ఆటోమొబైల్​ డీలర్స్​​ అసోసియేషన్ పేర్కొంది. తాజా నిర్ణయం వల్ల సమీప భవిష్యత్తులో​ ఈ–స్కూటర్లు, ఎలక్ట్రిక్​ కార్ల​ కొనుగోళ్లు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, బ్యాటరీ ఆధారంగా నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్​ జారీ, రెన్యువల్​ ఛార్జీల మినహాయింపుకు సంబంధించి 2020, మే 27న కేంద్రం డ్రాఫ్ట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది.

కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలను రెట్టింపు చేశాయి. FAME II పథకంలో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఎలక్ట్రిక్​ వాహనాల కొనుగోళ్లపై రెట్టింపు సబ్సిడీ అందిస్తున్నాయి. మూడు రాష్ట్రాలతో పాటు మరో 20 రాష్ట్రాలు ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించే ప్రక్రియలో పాలసీని సిద్ధం చేస్తున్నాయి.