ఈ ఒక్కరోజు పని చేయండి వర్మ

ఈ ఒక్కరోజు పని చేయండి వర్మ

Updated On : February 15, 2024 / 10:57 AM IST

తనను వేరే శాఖకు బదిలీ చేస్తూ హై పవర్ కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీస్ సర్వీసుకు మాజీ సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ చేసిన రాజీనామాను ప్రభుత్వం తిరస్కరించింది. పదవీ విరమణ చేసే వరకు సర్వీసులో కొనసాగాలని వర్మను ప్రభుత్వం కోరింది. వాస్తవానికి ఇవాళ(జనవరి 31, 2019) వర్మ పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో ఈ ఒక్క రోజు పనిచేయాలని ఆయనను హోం మంత్రిత్వ శాఖ కోరింది.

నాలుగు నెలల క్రితం పరస్పర అవినీతి ఆరోపణలతో సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ, డిప్యూటీ డైరక్టర్ రాకేష్ ఆస్తానాలను అర్థరాత్రి సెలవుపై ఇంటికి పంపించింది కేంద్రం. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ వర్మ సుప్రీంని ఆశ్రయించారు. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీం వర్మను తిరిగి సీబీఐ చీఫ్ గా నియమించాలని తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాలతో తిరిగి సీబీఐ చీఫ్ గా భాధ్యతలు చేపట్టిన వర్మపై  ప్రధాని నేతృత్వంలోని హైపవర్ కమిటీ బదిలీ వేటు వేసింది. వర్మను ఫైర్ సర్వీసుల డైరక్టర్ జనరల్ గా బదిలీ చేసింది. దీంతో వర్మ ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. వర్మ రాజీనామా చేసిన మూడు రోజులకే ఆరోపణలు ఎదుర్కొన్న ఆస్తానాను కూడా సివిల్ ఏవియేషన్ డిపార్ట్ మెంట్ కు కేంద్రం బదిలీ చేసింది.