Nisar satellite: రేపే నింగిలోకి ‘నిసార్’.. ఈ ఉపగ్రహం వల్ల మానవాళికి ఎలాంటి మేలు జరుగుతుంది..? ఇది ఎలా పనిచేస్తుందంటే..
భూమిని అణువణువు 12రోజులకు ఒకసారి స్కాన్ చేయనున్న ‘నిసార్’ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లేందుకు రంగం సిద్ధమైంది.

Nisar satellite
GSLV F16 Nisar: భూమిని అణువణువు 12రోజులకు ఒకసారి స్కాన్ చేయనున్న ‘నిసార్’ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లేందుకు రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి రేపు (బుధవారం) సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇందుకోసం మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహం నింగిలోకి వెళ్లనుంది.
2,392 కేజీల నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించింది. ఈ నిసాన్ ఉపగ్రహం అంతరిక్షం నుంచి భూమి అణువణువును 12రోజులకోసారి స్కాన్ చేస్తుంది. అడవులు, మైదానాలు, కొండలు పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు అన్నింటిని నిసార్ ఉపగ్రహం అధ్యయనం చేయనుంది. ఇందులో నాసాకి చెందిన ఎల్ -బ్యాండ్, ఇస్రోకి చెందిన ఎస్-బ్యాండ్ రాడార్లను శాస్త్రవేత్తలు అమర్చారు.
నాసా, ఇస్రో సంయుక్తంగా నాసా ఉపగ్రహాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.11,200 కోట్లుకాగా.. ఇస్రో వాటా కింద చేపట్టాల్సిన పనులకు రూ.800 కోట్లే ఖర్చయ్యాయి. సంస్థ అనుసరించిన చౌకైన ఇంజనీరింగ్ విధానాల ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ నిసార్ ఉపగ్రహం 2,392కిలోల బరువు ఉంటుంది. దీన్ని 747 కిలో మీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్ష్యలోకి పంపుతారు. 90 రోజుల తరువాత పని ప్రారంభిస్తుంది. రాత్రి, పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో భూమిని తన జంట రాడార్లతో నైసార్ స్కాన్ చేస్తుంది.
నిసార్ ఉపగ్రహం ప్రాంతల వారీగా భూమిని పరిశీలన చేస్తుంది. ఒకసారి 240 కిలోమీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని పరిశీలిస్తుంది. దాని చిత్రాల స్పష్టత 10మీటర్లుగా ఉంది. భూమిపై అన్ని ప్రాంతాలను 12రోజులకోసారి పరిశీలిస్తుంది. 97 నిమిషాల కోసారి భూమిని చుట్టేస్తుంది.
ధ్రువ ప్రాంతాల్లో మంచు ఫలకాల కదలికలు, కరుగుదలను నిసాన్ పరిశీలించగలదు. అగ్నిపర్వత విస్పోటాలు, కొండ చరియలు విరిగిపడటం వంటి విపత్తులను కూడా నిసాన్ ఉపగ్రహం పరిశీలిస్తుంది.
తుపాన్లు, సునామీలు వరదలు, కార్చిచ్చు వంటి విపత్తుల సమయంలో సహాయ చర్యలకు సహాయ పడుతుంది. అంతేకాదు.. నిర్దిష్ట ప్రాంతంలో నేల ఒక అంగుళం కుంగినా గుర్తించగలదు. వంతెనలు, డ్యామ్ లలో లోపాలనూ పసిగడుతుంది.
అటవీ విస్తీర్ణం, పచ్చదనంలో మార్పులు, పంటల ఎదుగుదల, నేలలో తేమ పరిశీలన ద్వారా ఉపరితల జలాలు, చిత్తడి నేలల్లో మార్పులను ఈ నిసాన్ ఉపగ్రహం పసిగడుతుంది.
నీటి వనరుల నిర్వహణకు ఈ ఉపగ్రహం దోహపడుతుంది. తద్వారా రైతులు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఇదో అద్భుత ఉపగ్రహమన్న నాసా..
భూమిని పరిశీలించేందుకు కక్ష్యలో ఇప్పటికే మనకు రెండు డజన్లకుపైగా ఉపగ్రహాలు ఉన్నాయి. కానీ, నిసాన్ ఒక సంచలనాత్మక ఉపగ్రహం. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ఒక సెంటీమీటర్ వరకు చిన్న మార్పులనుసైతం గుర్తించే సామర్థ్యంతో ఇది మనకు మరింత అవగాహనను కలిగిస్తుంది. భారతదేశం, అమెరికా దేశాలు కలిసి గతంలో ఎన్నడూలేని విధంగా భూమిని అధ్యయనం చేయడానికి నిసార్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని నాసాలోని ఎర్త్ సైన్స్ డైరెక్టర్ కరెన్ సెయింట్ జర్మైన్ అన్నారు.