వామ్మో..వాటర్ ట్యాంక్ ఎక్కేసిన ఎద్దు..!

మేడెక్కి మేసే ఎద్దును చూశావా అనేది ఒక పొడుపు కథ. కానీ నిజంగా ఎద్దులు మేడ ఎక్కుతాయా? మేడ ఎక్కుతాయో లేదో తెలీదు గానీ ఓ ఎద్దు మాత్రం ఏకంగా 125 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కేసింది. చక్కగా మొట్లు కనిపించాయి కదాని టకా టకా ఎక్కుకుంటూ పోయింది. కానీ పాపం అంత ఎక్కేశాననీ దానిక్కూడా తెలీనట్లుంది. పై వరకూ ఎక్కేశారు ఎందుకు ఎక్కానా అనుకుందో ఏమో పాపం ఆ బసవడు ముందుకు వెళ్లలేక..వెనక్కి రాలేక అక్కడే ఉండిపోయింది. హర్యానాలోని ఖెడా మురార్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ట్యాంకు ఉన్న మెట్ల మీదుగా ఎక్కేసి ఆ ఎద్దు అక్కడే చిక్కుకుపోయింది. ఎలా దిగాలో పాపం దానికి తెలీలేదు. ఈ క్రమంలో ఆ ఎద్దును గమనించిన స్థానికులు అధికారులకు తెలియజేశారు. దీంతో రెస్క్యూ టీమ్ తో వాటర్ ట్యాంక్ దగ్గరకు చేరుకున్నారు.
8 గంటల పాటు కష్టపడిన రెస్క్యూ టీమ్ ‘ఆపరేషన్ ఆక్స్’ను నిర్వహించి..ఎట్టకేలకూ క్రేన్ సాయంతో ఆ ఎద్దుకు సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. కాగా మెట్ల మీదుగా పైకి ఎక్కిన ఎద్దు అక్కడ ఇరుకుగా ఉన్న కారణంగా వెనుకకు తిరగలేకపోయింది. వాటర్ ట్యాంక్ ఎక్కిన ఎద్దును చూడటానికి స్థానికులు భారీగా చేరుకుని ఆసక్తిగా తిలకించారు.