UP Girl Ragini : ఊతకర్ర లేదు.. వీల్‌చైర్ లేదు.. ఒంటికాలితో 400 మీటర్లు.. కంటతడి పెట్టించే ఏడేళ్ల రాగిణి కథ.. చదువుపై ఆమె తపనకు సెల్యూట్!
UP Girl Ragini : యూపీలోని బల్లియా జిల్లా దిఘేడా గ్రామ పంచాయతీ పరిధిలోని రాణీపూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల రాగిణి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
UP Girl Ragini
UP Girl Ragini : విధి చేసిన గాయం ఆ పసిపాప కాళ్లను తుంచేసింది. వయసు ఏడేళ్లు.. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన సమయంలో ఒక కాలు లేక నరకం అనుభవిస్తోంది. ఊతకర్ర లేదు, చక్రాల కుర్చీ అంతకంటే లేదు.. కానీ, చదువుకోవాలనే ఆ చిన్నారి సంకల్పం ముందు ఆ వైకల్యం కూడా ఓడిపోయింది! విపరీతమైన పేదరికం, ఒంటికాలితో కుంటుతూ వెళ్లాల్సి వస్తున్నా సరే.. చదువుపై ఉన్న ఆరాటంతో రోజూ వందల మీటర్లు దూకుతూ బడి బాట పడుతోంది ఉత్తరప్రదేశ్ బాలిక రాగిణి. ఈ పసిపాప కష్టాన్ని చూసి ఇటు ఊరి జనం, అటు నెటిజన్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఆరు నెలల వయసులోనే కోలుకోలేని దెబ్బ!
యూపీలోని బల్లియా జిల్లా దిఘేడా గ్రామ పంచాయతీ పరిధిలోని రాణీపూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల రాగిణి కథ ఇది. ఈ చిన్నారికి కేవలం ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఒక దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో పాప ఒక కాలు తీవ్రంగా దెబ్బతింది. తండ్రి రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ. తీవ్రమైన పేదరికం వల్ల ఆ చిన్నారికి సరైన వైద్యం చేయించలేకపోయారు. కాలక్రమేణా ఒక కాలు పూర్తిగా పాడైపోయింది. అలాగని రాగిణి ఇంట్లో కూర్చోలేదు. తోటి పిల్లలు బడికి వెళ్తుంటే తాను కూడా వెళ్తానని ఏడ్చేది. అలా స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరింది.
రోడ్డుపై ఏడుస్తూనే పాఠశాలకు..
ఇంటి నుంచి బడికి ఉన్న 400 మీటర్ల దూరాన్ని రాగిణి ఒంటికాలితో ఎగురుతూ, కుంతుతూ చేరుకుంటుంది. ఈ ప్రయాణం ఆ చిన్నారికి నరకప్రాయంగా మారింది. దారి మధ్యలో అలసిపోయి, నొప్పి తట్టుకోలేక రోడ్డుపైనే కూర్చుని ఏడుస్తూ “నాకే ఎందుకీ శిక్ష దేవుడా” అని ప్రశ్నిస్తుంటుంది. మళ్లీ కాసేపటికి కన్నీళ్లు తుడ్చుకుని ఒంటికాలితోనే బడి వైపు అడుగులు వేస్తుంది. ఈ దయనీయ స్థితిని చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమిత్ పాల్ యాదవ్ చలించిపోయారు. చిన్నారికి కృత్రిమ కాలు (ఆర్టిఫిషియల్ లెగ్) లేదంటే ట్రైసైకిల్ ఇప్పించాలని సోషల్ మీడియా ద్వారా విన్నవించడంతో ఈ విషాదకర దృశ్యం కాస్తా వైరల్ గా మారింది.
Every time a poor girl needs a tricycle she should have received long ago, we first have to create a social media revolution. Why is the local administration so incompetent that it is never seen doing even the least that is expected of it?
📍 Ballia, UP https://t.co/UnfUdUGNgt pic.twitter.com/xGtLj94fSU
— Piyush Rai (@Benarasiyaa) September 1, 2026
కదిలిన యంత్రాంగం.. అండగా నిలిచిన ఉదారులు!
రాగిణి కష్టం సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో అధికారులు, పలువురు నాయకులు తక్షణమే స్పందించారు. విషయం తెలిసిన వెంటనే బల్లియా జిల్లా కలెక్టర్ మంగ్లా ప్రసాద్ సింగ్ స్పందించి.. దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు, వైద్యుల బృందాన్ని చిన్నారి ఇంటికి పంపించారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు రాగిణి నివాసానికి చేరుకుని, చిన్నారికి తక్షణ సహాయంగా ఒక వీల్‌చైర్‌తో పాటు రూ. 25,000 ఆర్థిక సాయాన్ని అందించారు. త్వరలోనే చిన్నారికి కృత్రిమ కాలు కూడా అమర్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. చదువుకోసం ఆ పసిపాప పడుతున్న తపనకు తగిన సాయం అందుతుండటంతో రాగిణి ముఖంలో మళ్లీ చిరునవ్వులు వికసిస్తున్నాయి.
Have a feeling this tricycle is just a formality that district magistrate in UP’s Ballia wanted to get done with. The little girl can barely ride it without help. This girl needs help of experts from private sector/individuals. The govt has made its intent clear. https://t.co/UnfUdUGNgt pic.twitter.com/WUzdvbq1v8
— Piyush Rai (@Benarasiyaa) September 2, 2026
