Hemant Soren: నేను బీఎమ్‌డబ్ల్యూలో ప్రయాణించడం వారికి కంటగింపుగా ఉంది..

నేను విమానాల్లో ప్రయాణిస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయడం, బీఎమ్‌డబ్ల్యూలో ప్రయాణించడం వారికి కంటగింపుగా ఉంది.

Hemant Soren: నేను బీఎమ్‌డబ్ల్యూలో ప్రయాణించడం వారికి కంటగింపుగా ఉంది..

Hemant Soren Comments while Jharkhand floor test

Updated On : February 5, 2024 / 5:23 PM IST

Hemant Soren: కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రపూరితంగా తనను జైల్లో పెట్టిందని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధినేత హేమంత్ సొరేన్ ఆరోపించారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఆయనను పోలీసులు సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీకి తీసుకువచ్చారు. చంపయీ సొరేన్ విశ్వాస పరీక్ష సందర్భంగా ఆయనకు మద్దతు తెలిపేందుకు శాసనసభకు హేమంత్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను అరెస్ట్ చేసిన జనవరి 31ని ప్రజాస్వామ్యంలో చీకటి దినంగా వర్ణించారు. తనను కుట్రప్రకారం అరెస్ట్ చేశారని, దీని వెనుక గవర్నర్ కార్యాలయం ప్రమేయం ఉందని ఆరోపించారు.

ఆదివాసీలు రాజకీయంగా ఎదగడం చూసి బీజేపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని హేమంత్ సొరేన్ విమర్శించారు. “ఆదివాసీలు అడవిలోనే బతకాలి అని చెప్పడానికి వారు వెనుకాడరు. మనం అడవిని వదిలి.. రాజ్యాధికారం చేపట్టి వాళ్ల పక్కన కూర్చోవడంతో వారి బట్టలు తడిసిపోయాయి. వాళ్లు మనల్ని అంటరానివారిగా చూస్తారు. అధికారాన్ని వాళ్లకు వదిలేస్తే మళ్లీ మనం అడవిలోకి వెళ్లిపోతామని అనుకుంటున్నారు. నేను విమానాల్లో ప్రయాణిస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయడం, బీఎమ్‌డబ్ల్యూలో ప్రయాణించడం వారికి కంటగింపుగా ఉంద”ని అన్నారు.

విదేశాలకు పారిపోయిన వారిని ఏమీ చేయరు
కేంద్రం కుట్రలు సాగబోవని, ఓటమిని ఒప్పుకోబోమని హేమంత్ సొరేన్ స్పష్టం చేశారు. “కుతంత్రాలలో విజయం సాధిస్తామని వారు అనుకుంటున్నారు. కానీ ఇది ఝార్ఖండ్. గిరిజనులు, దళితులు త్యాగాలు చేసిన రాష్ట్రం. కోట్లు దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని కేంద్ర ఏజెన్సీలు ఏమీ చేయవు. కానీ అమాయక గిరిజనులను మాత్రమే టార్గెట్ చేస్తాయి. నాపై మోపిన అభియోగాలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. గిరిజనుల కన్నీళ్లు మీకు పట్టవు కాబట్టి నేను ఏడవను. వారి ప్రతి కుట్రకు సరైన సమయంలో సమాధానం ఇస్తాన”ని హేమంత్ సొరేన్ పేర్కొన్నారు. కాగా, చంపయీ సొరేన్ విశ్వాస పరీక్షలో నెగ్గింది.

Also Read: కల్లోల కాంగ్రెస్.. ఈసారి 40 స్థానాల్లో కూడా గెలవడం సందేహమే..!

జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించిన హేమంత్ సొరేన్
ఈడీ తనను అరెస్టు చేయడాన్ని వ్యవతిరేకిస్తూ హేమంత్ సొరేన్ సోమవారం ఝార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఈ నెల 9వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఈడీని ఆదేశించింది. కేసు విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది.