Congress Party : కల్లోల కాంగ్రెస్.. దిక్సూచిలేని నావలా అస్తిత్వం కోసం కొట్టుమిట్టాడుతున్న హస్తం పార్టీ..
Congress Party : కూటమి ధర్మానికి కట్టుబడి ఉండకపోవడంలో అసలు కాంగ్రెస్ పాత్ర ఎంత..? ఆయా పార్టీల అవకాశవాదమెంత అన్నది ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Special Story On Congress Party
Congress Party : ఈ దేశానికేం కావాలో…కాంగ్రెస్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని… జాతీయస్థాయి నుంచి ప్రాంతీయస్థాయి వరకూ…హస్తం నేతలు చెబుతుంటారు. నిజానికి కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి చూస్తే… ఆ పార్టీకేంకావాలో…వారికే తెలియని స్థితి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ… దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన పార్టీ.. ఆసేతుహిమాచలాన్ని శాసించిన పార్టీ… ఇప్పుడు అస్తిత్వం కోసం కొట్టుమిట్టాడుతోంది. సొంతంగా పోటీచేసి అధికారపీఠాన్నిఅధిరోహించే సత్తా లేదు. ప్రాంతీయ, భావసారూప్యతున్న జాతీయ పార్టీలతో పొత్తుపెట్టుకుని… అధికారంలోకి రాగల నేర్పు చేతకావడం లేదు.
అత్యంత బలంగా ఉన్న అధికారపక్షాన్ని.. అదనుచూసి దెబ్బగొట్టగల చాణక్యత ప్రదర్శించలేకపోతోంది. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య భారీగా ఉన్నప్పటికీ…. ఆ ప్రత్యామ్నాయం తానేనేన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించలేకపోతోంది. మొత్తంగా పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దిక్సూచిలేని నావలా తయారయింది.
Read Also : Chandrababu Naidu: ‘ప్రజాకోర్టు’ పేరుతో టీడీపీ ఛార్జ్‌షీట్ విడుదల.. చంద్రబాబు ఏమన్నారంటే?
543 స్థానాలున్న లోక్‌సభలో….దేశంలోనే అత్యంత పురాతనమయిన జాతీయ పార్టీ కాంగ్రెస్ 40 సీట్లన్నా గెలుచుకుంటోందో లేదో….ఈ మాట అన్నది జాతీయస్థాయిలో కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్న బీజేపీనో…రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయపార్టీలో కాదు…నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా…ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నమాట ఇది. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించిన రెండు రోజుల తర్వాత మమత ఈ వ్యాఖ్యలు చేశారు.
అంటే.. ఇప్పటిదాకా ఆమె కలిసి నడిచిన పార్టీపై ఆమెకెంత అపనమ్మకం పెరిగిపోయిందో అర్ధంచేసుకోవచ్చు. మమతే కాదు…ఆప్ అధినేత కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్…అందరూ ఉన్నట్టుండి కాంగ్రెస్ కు దూరం జరిగారు. సరిగ్గా ఎన్నికలకు ముందు..ఆయా నేతలు..ఇలా వివాదాస్పదంగా వ్యవహరించడం, కూటమి ధర్మానికి కట్టుబడి ఉండకపోవడంలో అసలు కాంగ్రెస్ పాత్ర ఎంత..? ఆయా పార్టీల అవకాశవాదమెంత అన్నది ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరినుంచి మూడు దశాబ్దాల పాటు దేశంలో, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కు వచ్చేది కాదు. ఒంటరిగానే ప్రభంజనం సృష్టిస్తుండేది. భారతదేశ రాజకీయాలంటే కాంగ్రెస్ పేరు తప్ప మరేమీ వినిపించని కాలమది. తర్వాత కాలంలో పరిస్థితులు మారాయి. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, జాతీయస్థాయిలో బీజేపీ బలపడుతూ ఉండగా..కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఇక్కడే బీజేపీ, ఇతర పార్టీలు తమవైన రాజకీయాలు మొదలుపెట్టాయి. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే సత్తా లేకపోవడంతో..మిత్రపక్షాలను కలుపుకుని కూటమిలుగా మారడం మొదలుపెట్టాయి. క్రమంగా సంకీర్ణరాజకీయాలు దేశంలో భాగమైపోయాయి.
పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ :
అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతకాలం పాటు కాంగ్రెస్ సొంతంగా ఎన్నికల్లో పోటీచేసేందుకే మొగ్గుచూపింది. కూటములు, పొత్తులతో పనిలేకుండా తిరిగి దేశంలో, ఆయా రాష్ట్రాల్లో అధికారంలోస్తామని భావించేది. కానీ 1990ల చివరినాటికి పరిస్థితి గ్రహించింది. భావసారూప్యతున్న పార్టీలతో పొత్తు పెట్టుకుని, కూటములగా ఏర్పడి.. ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లడమే…కాంగ్రెస్ పునరుజ్జీవానికి ప్రాతిపదిక అన్న వాస్తవాన్ని గుర్తెరిగి ప్రవర్తించింది. అలా 2004 ఎన్నికల్లో…సర్దుబాట్లు, పొత్తులతో దేశంలో అధికారంలోకి రాగలిగింది. సంకీర్ణ రాజకీయాలదే భవిష్యత్తన్న సంగతిని గ్రహించడంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియగాంధీ సమయస్ఫూర్తితోనే వ్యవహరించారు. ఫలితంగా…వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా కాంగ్రెస్ నడవగలిగి..వరుసగా పదేళ్లపాటు అధికారంలో ఉండగలిగింది.

Cracks in Indian opposition alliance
ఎప్పటికేది ప్రస్తుతమో… అలాంటి వ్యూహాన్ని ఆచరించడంలో…తలపండిన రాజకీయాలు నడిపించడంలో…ఓటర్ల నాడి పట్టుకోవడంలో ఆరితేరిన కాంగ్రెస్‌కు మరిప్పుడేమయింది…? వరుసగా రెండుసార్లు అధికారానికి దూరంగా ఉండి కూడా..తిరిగి పుంజుకోవడానికి ఎందుకింత కష్టపడుతోంది…? కలిసి నడవాలని వచ్చిన పార్టీలకు ఎందుకు నమ్మకం కల్పించలేకపోతోంది..? కూటమి భాగస్వామ్య పార్టీలను ఒక్కొక్కటిగా ఎందుకు దూరం చేసుకుంటోంది…? అంటే వచ్చే సమాధానం…వాస్తవ పరిస్థితులను గ్రహించే స్థితిలో కాంగ్రెస్ లేదన్నదే. UPAలో ఎలాగైతే…అన్నీ తానై వ్యవహరించిందో…కూటమి పెద్దన్న పాత్ర పోషించిందో…ఇండియా కూటమిలోనూ సరిగ్గా ఆ స్థానాన్నే కాంగ్రెస్ కోరుకుంటోంది. తన మాటే నెగ్గాలనుకుంటోంది. కూటమి నాయకత్వ హోదాలో తానే ఉండాలనుకుంటోంది. ఈ కారణాలే….ఇండియా కూటమిని విచ్ఛిన్నకర దిశగా నడిపిస్తున్నాయి.
అత్యంత బలంగా బీజేపీ :
పొరుగు దేశాలు రాజకీయ అనిశ్చితితో అల్లాడుతోంటే.. దేశానికి స్థిరత్వం అందించడం, ధరల పెరుగుదల భారం ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగైన స్థితిలో ఉంచడం, బలమైన విదేశాంగవిధానం, అంతర్జాతీయంగా భారత్ ప్రాబల్యం పెరగడం, అయోధ్య రామాలయం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిబుల్ తలాక్ వంటివాటితో… బీజేపీ అత్యంత బలంగా కనిపిస్తోంది. అంత బలమైన అధికార పార్టీకి అదే స్థాయిలో తామూ ప్రత్యామ్నాయం అని నమ్మకం కలిగించడంలో కాంగ్రెస్ పార్టీ కూటమి విఫలమవుతోంది. దీనికి కారణం కాంగ్రెస్ బలహీనంగా ఉండడం. మిత్రపక్షాలను కలుపుకుపోవడంలో విఫలం కావడం.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా గెలిచిన స్థానాలు 52. ఈసారి… ఆ 52 కాదు కదా.. 40 కూడా గెలవదేమో అన్నది మమతాబెనర్జీ లాంటి వారి సందేహం. అలాంటి బలహీన స్థితిలో ఉన్న కాంగ్రెస్….కూటమికి నాయకత్వం వహించాలని కోరుకోవడమేంటన్నది ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల అభ్యంతరం. కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవగల స్థానంలో ఉన్న తాము పక్కకు తప్పుకుని కాంగ్రెస్ కు నాయకత్వ బాధ్యతలు ఎందుకివ్వాలని ఆయా పార్టీల నేతలు ప్రశ్నించుకుంటున్నారు.
కాంగ్రెసే తన పరిస్థితిని గుర్తించి కూటమి నాయకత్వ రేసు నుంచి తప్పుకోవాలని.. ఓ సాధారణ పార్టీగా ఉండిపోవాలని మమత, కేజ్రీవాల్, నితీశ్ కుమార్ వంటి నేతలు కోరుకుంటున్నారు. కూటమి ప్రధాన అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరో…ఆ పార్టీలోని ఇంకెవరదన్నా పేరో కాకుండా తమ పేరు ప్రకటించాలని పోటీలు పడుతున్నారు. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదని గ్రహించి మెల్లిగా కూటమి నుంచి జారుకుంటున్నారు.
Read Also : Telangana: టీజీగా టీఎస్ మార్పు.. రూ.500కు గ్యాస్ సిలిండర్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు