Farmers Protest: ఢిల్లీలో రైతుల ఆందోళన.. ఏం జరుగుతుందో తెలుసా? ఎటుచూసినా వారే..

ఇనుపకంచెలు, బారికేడ్లు వంటివి ఏర్పాటుచేసి... రైతులకు అడుగుతీసి అడుగువేయడం కష్టంగా మార్చింది.

Farmers Protest: ఢిల్లీలో రైతుల ఆందోళన.. ఏం జరుగుతుందో తెలుసా? ఎటుచూసినా వారే..

Farmers Protest Against Central Govt

అన్నదాతకు మళ్లీ ఆగ్రహమొచ్చింది. చరిత్ర ఎరుగని, అలుపెరగని, పట్టు సడలని అకుంఠత దీక్షచేసి మూడేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన రైతన్నలు.. ఇంకోసారి చలో ఢిల్లీ అంటున్నారు. నోటిమాటతో అడిగితే… విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తే…. ఎదురుచూపులు చూస్తూ కూర్చుంటే..సమస్యలు పరిష్కారం కావని..హస్తిన వేదికగా దేశమంతా వినిపించేలా గర్జించడమే డిమాండ్ల సాధనకు ఉన్న ఏకైక మార్గమని రైతులు నమ్ముతున్నారు.

మూడేళ్ల క్రితం తాము అనుసరించిన వ్యూహంతోనే పోరుబాట పట్టారు.. గత పోరాట విజయ స్ఫూర్తితో డిమాండ్ల సాధనకు ఆరు నెలలైనా వెనక్కి తగ్గేది లేదంటున్న రైతన్నలు… అందుకు సరిపడ ఏర్పాట్లతో ఢిల్లీ బయలుదేరారు. యుద్ధానికి సిద్ధమయినట్టుగా కనిపిస్తున్న భద్రతాబలగాల వలయాలు, అడుగుకో బారికేడ్ల వరసలు, ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలు, లాఠీ దెబ్బలు, టియర్ గ్యాస్‌…ఇవేవీ తమను అడ్డుకోలేవని…అంతిమ విజయం తమదేనని అన్నదాతలు చెబుతున్నారు.

ఢిల్లీ-గురుగావ్ ఎక్స్‌ప్రెస్‌ వే. రోజుకు సగటున నాలుగు లక్షల వాహనాలు ప్రయాణం సాగించే మార్గం. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే ఇప్పుడు మొత్తం బారికేడ్లతో, భద్రతాబలగాలతో నిండిపోయింది. ఇదే కాదు…ఉత్తరప్రదేశ్ నుంచి, హర్యానా నుంచి ఢిల్లీ చేరే మార్గాలన్నింటిలో ఇదే పరిస్థితి. పంజాబ్ నుంచి వస్తున్న రైతులను రాజధానికి చేరనీకుండా అడ్డుకునేందుకు కేంద్రం అన్ని అస్త్రాలూ ఉపయోగిస్తోంది. పంజాబ్ -హర్యానా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొంది.

పంజాబ్ నలుమూలల నుంచీ..
పంజాబ్‌లో ఉన్న ఆప్ ప్రభుత్వం అన్నదాతల ఆందోళనలను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడంలేదు. దీంతో పంజాబ్ నలుమూలల నుంచీ రైతులు అన్ని ఏర్పాట్లతో ఢిల్లీ బయలుదేరుతున్నారు. వారికి బీజేపీ ప్రభుత్వమున్న హర్యానా పోలీసుల నుంచి సరిహద్దుల్లో తీవ్రప్రతిఘటన ఎదురవుతోంది. శంభు సరిహద్దులకు వేలాదిగా వచ్చిన రైతులు, వారిని అడ్డుకునేందుకు ప్రయోగించిన టియర్ గ్యాస్‌తో అక్కడ యుద్ధం జరుగుతుందేమోన్న సందేహాలు కలిగించాయి. తర్వాత కాస్త పరిస్థితి సద్దుమణిగినా..రైతులను ఢిల్లీ వైపుగా వెళ్లనివ్వకుండా ఉండేందుకు హర్యానా పోలీసులు, కేంద్ర బలగాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికల వేళ అన్నదాతలు ఇలా ఆందోళనల బాట పట్టడం రాజకీయంగా ఇబ్బందులు కలిగించేదైనప్పటికీ…. కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఓ వైపు రైతు సంఘాలతో చర్చలు జరుపుతూనే మరో వైపు రైతులను నియంత్రించేందుకు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతాబలగాలను మోహరించింది.

కీలక ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు, CAPF, RAPF సిబ్బంది పెద్ద సంఖ్యలో పహారా కాస్తున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సరిహద్దులు, ఢిల్లీ-నోయిడా మార్గం, ఘాజీపూర్ సరిహద్దులన్నీ భద్రతాబలగాల గుప్పెట్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో అంబులెన్స్‌ల ప్రయాణం కూడా కష్టంగా ఉంది. అసలు పంజాబ్ నుంచి వచ్చిన రైతులను హర్యానా దాటి వెళ్లనీకుండానే…అక్కడి పోలీసులు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఏడు జిల్లాల్లో ఇంటర్నెంట్ సేవలు నిలిపివేశారు. 144 సెక్షన్ విధించారు.

ఎర్రకోటకు సందర్శకులను నిలిపివేశారు. ఢిల్లీ-యూపీ, పంజాబ్-హర్యానా-ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో మూడేళ్ల క్రితం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఎటుచూసినా తుపాకులు చేతబూనిన భద్రతాసిబ్బందే కనిపిస్తున్నారు

అడుగు పెట్టనివ్వకూడదనుకోవడానికి కారణం?
కేంద్రం ఇన్ని జాగ్రత్తలలు తీసుకోవడానికి..రైతులను అసలు ఢిల్లీలోనే అడుగుపెట్టనివ్వకూడదనుకోవడానికి కారణం… మూడేళ్ల క్రితం వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం సాగిన ఉద్యమం. ఆ ఆందోళనలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఒకరోజో, ఒక వారమో ఆందోళన చేసి.. అక్కడినుంచి వెళ్లిపోలేదు రైతులు.

ఏడాదిపాటు శిబిరాల్లో తలదాచుకుంటూ ఆందోళనలు కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళనలు చేయడం, ఇంటికి వెళ్లిపోయి.. మళ్లీ ఉదయమే వచ్చి నిరసనల్లో పాలుపంచుకోవడంలా కాకుండా…ఇల్లూవాకిలీ వదిలిపెట్టి..కుటుంబాలకు దూరంగా ఉంటూ రోడ్లు పక్కన టెంట్లు వేసుకుని ఆందోళనలు జరిపారు. సాధారణంగా రైతులు ఎల్లప్పుడూ వ్యవసాయ పనుల్లో మునిగి ఉంటారు. ఉద్యమాలు, ధర్నాలు వంటివాటికి వీలయినంత దూరంగా ఉంటారు.

కానీ అప్పుడు అన్నదాతలు పోరాటమే ఊపిరిగా బతికారు. ఎందరిపైనో కేసులు నమోదయ్యాయి. మరికొందరు చనిపోయారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. వ్యవసాయ చట్టాలు రద్దుచేస్తున్నామని కేంద్రం ప్రకటించిన తరువాతే ఈ ఆందోళనలు ముగిసిపోయాయి. రైతుల పోరాటాన్ని, వారి విజయాన్ని ప్రపంచమంతా ఆశ్చర్యపోయి చూసింది. తర్వాత దేశంలో ఎందరికో ఈ ఉద్యమం ఆదర్శంగా నిలిచింది. అదే స్ఫూర్తితో మరోసారి పోరుబాట పట్టారు అన్నదాతలు.

రైతులు ఆందోళనలకు పిలుపుఇవ్వడానికి ముందే జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మళ్లీ మళ్లీ చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటిస్తోంది. చర్చలు జరుపుతోంది. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. చర్చల విషయంలో సానుకూలంగా ఉంటూనే.. భద్రత విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది కేంద్రం. ఇనుపకంచెలు, బారికేడ్లు వంటివి ఏర్పాటుచేసి…రైతులకు అడుగుతీసి అడుగువేయడం కష్టంగా మార్చింది. గత ఆందోళనల సమయంలో 2021 జనవరి 26న రైతులు…కళ్లు చెదిరే భద్రతను దాటుకుని వెళ్లి మరీ ఎర్రకోటపై జెండా ఎగరేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Uttam Kumar Reddy: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్