పహల్గాం ఉగ్రదాడి తర్వాత మళ్లీ ఇప్పుడు పెరుగుతున్న పర్యాటకులు.. జమ్మూకశ్మీర్‌లో ఇది ఎలా సాధ్యమవుతోందంటే..
పర్యాటక రంగాన్ని తిరిగి పుంజుకునేలా చేస్తున్నారు.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా జమ్మూకశ్మీర్ వెళ్లే అవకాశం ఉంది.

పహల్గాంలో ఉగ్రదాడి కారణంగా కశ్మీర్ టూరిజం పరిశ్రమ కుప్పకూలింది. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత కోట్ల రూపాయల విలువజేసే హోటల్, హౌస్‌బోట్ బుకింగ్‌లు రద్దయ్యాయి. ఈ పరిస్థితుల నుంచి అక్కడి టూరిజం పరిశ్రమ బయటపడుతోంది.
పహల్గాం, కొకర్నాగ్, అచబల్, వేరినాగ్‌కు జూన్ రెండో వారం తర్వాత రోజుకు 200-400 మంది సందర్శకుల చొప్పున వచ్చారు. ఇప్పుడు రోజుకు 5,000 మందికి పైగా వస్తున్నారు. పర్యాటక రంగాన్ని తిరిగి పుంజుకునేలా చేసేందుకు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా టూర్లు, సమావేశాల్లో నిమగ్నమయ్యారు.
టూరిజం హోటళ్లలో ప్రస్తుతం 20-30 శాతం ఆక్యుపెన్సీ ఉందని ట్రావెల్ ఏజెంట్స్ సొసైటీ ఆఫ్ కాశ్మీర్ అధ్యక్షుడు మొహమ్మద్ ఇబ్రాహీం సియాహ్ చెప్పారు. జూన్ 18-19న పహల్గాం వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జూలై 7-8 తేదీలలో పాన్ ఇండియా టూరిజం సెక్రటరీస్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
“ఇక్కడ టూరిజం పూర్తిగా నిలిచిపోయింది. మళ్లీ ఇప్పుడు పెరుగుతోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, డెలిగేషన్ల రాక, సమావేశాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కశ్మీర్ టూరిజం తిరిగి ఊపందుకుంటుంది” అని షెకావత్ శ్రీనగర్‌లో జరిగిన హై లెవల్ మీటింగ్‌లో చెప్పారు.
ఈ సమావేశంలో 2025-26 టూరిజం బడ్జెట్, డెస్టినేషన్ డెవలప్‌మెంట్, మోదీ విజన్‌లోని 50 ఐకానిక్ గ్లోబల్ డెస్టినేషన్లలో భాగంగా జమ్మూ కశ్మీర్‌పై చర్చ జరిగింది. జూలై 3-4న శ్రీనగర్ లాల్‌చౌక్‌లో తన భార్యతో కలసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ టీ తాగారు. జూలై 6న ప్రధానమంత్రి కార్యాలయ సలహాదారు తరుణ్ కపూర్ లాల్‌చౌక్‌లో ట్రేడర్లు, స్థానికులను కలిశారు. ఈ కార్యక్రమాల వల్ల పర్యాటకుల దృష్టి మళ్లీ జమ్మూకశ్మీర్‌పై పడుతోంది.
ఈ కార్యక్రమం అమర్‌నాథ్ యాత్ర సమయంలో జరగడం విశేషం. ఇప్పటివరకు 2 లక్షల మంది పైగా యాత్రికులు హోలీ కేవ్‌ను దర్శించారు. 600 అదనపు సీఏపీఎఫ్ కంపెనీలతో సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో భద్రతపై భయం తగ్గింది.
Also Read: బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో ఇంకా దారుణమైన డైలాగులు ఉంటాయి: జగన్
‘ఛలో కాశ్మీర్’ పేరిట దేశవ్యాప్త క్యాంపెయిన్
జమ్మూకశ్మీర్ జీడీపీలో టూరిజం వాటా 7 శాతంగా ఉంది. 20 లక్షల మందికి ఉపాధి కల్పించే రంగం ఇది. 2024లో 3.5 మిలియన్‌ల మంది టూరిస్టులు వచ్చారు.
ఇండియాలో 200కి పైగా టూరిజం స్టేక్‌హోల్డర్స్, ట్రావెల్ ఏజెంట్లను కలసిన ఒమర్ అబ్దుల్లా ‘ఛలో కాశ్మీర్’ పేరిట దేశవ్యాప్త క్యాంపెయిన్ కోసం పిలుపునిచ్చారు. టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రివ్యాంప్ చేసి, ఓటీఏఎస్‌లో అందుబాటులోకి తేవాలని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కృషి చేస్తోంది.
జూలై 10న కోల్‌కతాలో జరిగిన టూరిజం అండ్ ట్రేడ్ ఫెయిర్ (TTF)లో పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా 175 ట్రావెల్ ఏజెంట్లతో మాట్లాడారు. “పహల్గాం దాడి తర్వాత పరిస్థితి ఎలా ఉందో మీరు స్వయంగా చూడాలని ఆహ్వానిస్తున్నాం. జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో టూరిజం మళ్లీ అభివృద్ధి చెందుతోంది” అని అన్నారు.
దుర్గాపూజ హాలీడేల నేపథ్యంలో బెంగాల్ ప్రజలను ఆకర్షించేందుకు సీఎం మమతా బెనర్జీ కూడా ఆహ్వానాన్ని అంగీకరించి జమ్మూ కాశ్మీర్‌కు రావాలని చెప్పారు.
మరోవైపు, దుర్గాపూజా సెలవుల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్ర ప్రజలను జమ్మూకశ్మీర్ సందర్శించాలని ప్రోత్సహించారు. జమ్మూకశ్మీర్‌ను సందర్శించాలని ఒమర్ అబ్దుల్లా చాలాకాలంగా మమతా బెనర్జీని ఆహ్వానిస్తున్నారు. ఇందుకు తాజాగా ఆమె అంగీకరించారు.
అలాగే, టాస్క్ ప్రెసిడెంట్ సియాహ్ తెలిపిన వివరాల ప్రకారం.. త్వరలో అహ్మదాబాద్ ట్రావెల్ అండ్ ట్రేడ్ ఫెయిర్ జరగనుంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లో పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని గుజరాత్ టూరిస్టులను ఆకర్షించవచ్చు. అహ్మదాబాద్‌లో జరిగే ట్రావెల్ అండ్ ట్రేడ్ ఫెయిర్ కార్యక్రమానికి హాజరు కావాలని తాము ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించనున్నారు.