Priyanka Gandhi: వయనాడ్ ఫలితంపైనే అందరిచూపు.. ప్రియాంక మెజార్టీపై బెట్టింగ్‌లు

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి విజయం సాధించారు.

Priyanka Gandhi

Wayanad bypoll Election Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో వెల్లడి కానున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు ఇవాళ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. ఉదయం 8గంటలకు ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. అయితే, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో పాటు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ పోటీచేసిన వయనాడ్ నియోజకవర్గం ఫలితంపైనే అందరిచూపు ఉంది.

Also Read: విజేతను ప్రకటించే వరకు పోలింగ్‌ బూత్‌ను వదిలి వెళ్లొద్దు : శరద్ పవార్, అఖిలేష్ యాదవ్

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి విజయం సాధించారు. అదేవిధంగా రాయ్ బరేలీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్.. అక్కడ కూడా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ బరిలోకి దిగారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆమెకు ఇదే తొలిసారి. ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే తొలిసారి పార్లమెంట్ లోకి అడుగు పెట్టనున్నారు.

Also Read: గెలుపు ఎవరిది? మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ..

వయనాడ్ లో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితం వెలువడే అవకాశం ఉంది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ప్రియాంక గాంధీ విజయంకోసం రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు వయనాడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇదిలాఉంటే.. వయనాడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కావడంతో ఆమె విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఆమె ఎంత మెజార్టీతో విజయం సాధిస్తుందనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై బెట్టింగ్ లు సైతం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.