గెలుపు ఎవరిది? మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ..

మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా లేక తలకిందులు అవుతాయో చూడాలి.

గెలుపు ఎవరిది? మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ..

Updated On : November 22, 2024 / 10:43 PM IST

Maharashtra, Jharkhand Election Results 2024 : మహారాష్ట్రలో కింగ్ ఎవరో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. మరాఠా గడ్డపై ఏ పార్టీ జెండా పాతనుంది? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఎవరిది అసలైన శివసేన అనేది ప్రజలు తేల్చే సమయం వచ్చేసింది. అటు ఝార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. పార్టీలు మాత్రం గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై క్లారిటీ రానుంది. రెండు రాష్ట్రాలతో పాటు 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు జరగడంతో వాటి ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో 66శాతం పోలింగ్ నమోదైంది. 30ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ నమోదైంది. మహాయుతి కూటమి అధికారంలోకి వస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు. బీజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ.. మహాయుతిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ కలిసి ఎన్నికల బరిలో నిలిచాయి. ఇక బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి. 156 మంది రెబల్స్ బరిలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కులగణన, రిజర్వేషన్లు, రైతుల పంటలకు మద్దతు ధరలు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి.

ఝార్ఖండ్ లో 81 ఒక అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. జార్ఖండ్ లో 67.74 శాతం పోలింగ్ నమోదైంది. ఝార్ఖండ్ లో ఇండియా కూటమి, ఎన్డీయే మధ్య పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంఎల్ కలిసి పోటీ చేశాయి. ఎన్డీయే కూటమిలో బీజేపీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు కలిసి బరిలో నిలిచాయి. 81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ 41 సీట్లు. ఝార్ఖండ్ లో అక్రమ చొరబాట్లు, రిజర్వేషన్లు, జేఎంఎం అవినీతి, రైతుల పంటలకు మద్దతు ధరలు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు ప్రధాన అంశాలుగా నిలవబోతున్నాయి.

వయనాడ్ ఉప ఎన్నికల ఫలితం కూడా మరికొన్ని గంటల్లో రానుంది. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ వయనాడ్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గెలుపుపై ఆమె గంపెడాశలు పెట్టుకున్నారు. వయనాడ్ లో 64.72 శాతం పోలింగ్ నమోదైంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో గెలుపుపై ఎన్డీయే, ఇండియా కూటములు ధీమాతో ఉన్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా లేక తలకిందులు అవుతాయో చూడాలి.

Also Read : ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో కమల వికాసం..! ఎన్డీయే కూటమి వైపే సర్వే సంస్థల మొగ్గు..