విజేతను ప్రకటించే వరకు పోలింగ్ బూత్‌ను వదిలి వెళ్లొద్దు : శరద్ పవార్, అఖిలేష్ యాదవ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూటమి అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు.

Akhilesh Yadav and Sharad Pawar
Maharashtra Jharkhand Election Result 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పేపర్లను లెక్కించనుండగా.. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రెండు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలకు, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి.
మహారాష్ట్రలో కౌంటింగ్ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూటమి అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. కౌటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉండాలని అన్నారు. విజయం సాధించిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావొద్దని, విజయం సాధించిన అభ్యర్థి విజయ ధృవీకరణ పత్రం తీసుకున్న తర్వాతనే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలని శరద్ పవార్ సూచించారు.
Also Read: గెలుపు ఎవరిది? మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ..
అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగాయి. కతేహరి, కర్హల్, మీరాపూర్, ఘజియాబాద్, మజ్వాన్, సిసామౌ, ఖైర్, ఫుల్‌పూర్, కుందర్కి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గాల్లో ఇవాళ ఫలితాలు వెల్లడి కానున్నాయి. యూపీలో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆ పార్టీ అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తరువాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలి. ఓట్ల లెక్కింపులో ఏదైనా అవకతవకలు జరిగినట్లు అనిపిస్తే వెంటనే ఎన్నికల కమిషన్ కు, మాకు తెలియజేయండి అంటూ సూచించారు. విజయ ధృవీకరణ పత్రం పొందే వరకు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి.. ఎలాంటి అజాగ్రత్తలకు తావివ్వొద్దు అంటూ అఖిలేష్ యాదవ్ ఆ పార్టీ అభ్యర్థులకు సూచించారు.