దేశంలోనే మొట్టమొదటిది.. అండర్‌వాటర్ రోడ్-రైల్ టన్నెల్‌ను నిర్మించనున్న భారత్.. అద్భుతః
సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. లాజిస్టిక్స్ వ్యయం తగ్గుతుంది. సామాజిక-ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుంది.
- రూ.18,000 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు
- అస్సాంలోని గోహ్పూర్ నుంచి నుమాలిగఢ్ వరకు
- 4 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్
Underwater Road-Rail Tunnel: కేంద్ర ప్రభుత్వం రూ.18,000 కోట్ల వ్యయంతో దేశంలో తొలి అండర్‌వాటర్ రోడ్-రైల్ టన్నెల్‌ను నిర్మించనుంది. అస్సాం రాష్ట్రంలో గోహ్పూర్ నుంచి నుమాలిగఢ్ వరకు దీన్ని నిర్మిస్తారు. ఈ 4 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్‌కు రూ.18,662 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బ్రహ్మపుత్ర నది కింద రోడ్-రైల్ టన్నెల్ నిర్మిస్తారు.
ప్రస్తుతం నుమాలిగఢ్ వద్ద నేషనల్ హైవే-715 నుంచి గోహ్పూర్ వద్ద నేషనల్ హైవే-15 వరకు దూరం 240 కిలోమీటర్లుగా ఉంది. ఈ మార్గం నేషనల్ హైవే-52పై సిల్ఘాట్ సమీపంలోని కాలియాభోంబోరా మీదుగా సాగుతుంది. ప్రయాణానికి 6 గంటలు పడుతుంది. ఈ మార్గం నుమాలిగఢ్, కాజిరంగా నేషనల్ పార్క్, బిస్వనాథ్ పట్టణం మీదుగా వెళ్తుంది.
ప్రస్తుతం నుమాలిగఢ్ నుంచి గోహ్పూర్ వరకు దూరం 240 కిలోమీటర్లు. అండర్‌వాటర్ రోడ్-రైల్ టన్నెల్ ప్రాజెక్ట్ పూర్తైతే దూరం 34 కిలోమీటర్లకు తగ్గుతుంది. అంటే మొత్తం తగ్గింపు సుమారు 206 కిలోమీటర్లు ఉంటుంది. ప్రయాణ సమయం కూడా సుమారు 6 గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గుతుంది.
Also Read: తెలంగాణలో ‘వాలంటీర్లు’.. మీరు అనుకుంటున్నట్టు కాదు..
క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ శనివారం 4 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీన్ని ఇంజినీరింగ్-ప్రొక్యూర్మెంట్-కన్స్ట్రక్షన్ (ఈపీసీ) మోడల్ ద్వారా అభివృద్ధి చేస్తారు.
లెక్కలేనన్ని లాభాలు
ఇది భారతదేశంలో తొలి అండర్‌వాటర్ రోడ్-రైల్ టన్నెల్. ప్రపంచంలో రెండోది. ఈ ప్రాజెక్ట్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ సహా ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనాన్ని అందిస్తుంది. సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. లాజిస్టిక్స్ వ్యయం తగ్గుతుంది. సామాజిక-ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుంది.
ఈ ప్రాజెక్ట్ అస్సాం రాష్ట్రంలోని ప్రధాన ఆర్థిక, సామాజిక, రవాణా కేంద్రాలకు నిరంతర అనుసంధానం అందిస్తుంది. అదనంగా మల్టీ-మోడల్ ఇంటిగ్రేషన్ బలపడుతుంది. 11 ఆర్థిక కేంద్రాలు, 3 సామాజిక కేంద్రాలు, 2 పర్యాటక కేంద్రాలు, 8 లాజిస్టిక్ కేంద్రాలతో అనుసంధానం ఏర్పడుతుంది. 4 ప్రధాన రైల్వే స్టేషన్లు, 2 విమానాశ్రయాలు, 2 ఇన్‌ల్యాండ్ వాటర్వేస్తో కనెక్టివిటీ మెరుగవుతుంది.
ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అంటే దేశ అంతర్గత నదులు, జలమార్గాల ద్వారా జరిగే రవాణా వ్యవస్థ. ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఊతమిస్తుంది. ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. వాణిజ్యం, పరిశ్రమ అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి.
