Dowry Harassment
Dowry Harassment: టెక్నాలజీ పెరుగుతోంది.. ప్రతీ విషయంపైన మహిళలు అవగాహన పెంచుకుంటున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళల పట్ల పురుషుల దోరణి క్రమంగా మారుతూ వస్తుంది. గతంలో చాలామంది మహిళలు అత్తవారింట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. భర్త, అత్తమామలు పెట్టే ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలకుసైతం పాల్పడిన ఘటనలు ఉన్నాయి. వరకట్న వేధింపులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ, మారుతున్న కాలానుగుణంగా వరకట్నం వేధింపుల సమస్యలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. అయినా కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య మహిళలను వేధిస్తోంది. తాజాగా.. ఓ భర్త తన భార్యపట్ల దారుణంగా ప్రవర్తించాడు.
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం తేవాలంటూ ఆఫ్రికన్ జాతి పక్షితో పొడిపించి తీవ్రంగా గాయపర్చాడు. భర్తకు అత్తమామలు కూడా మద్దతుగా నిలవడంతో వారు పెట్టే ఇబ్బందులు భరించలేక ఆ యువతి పుట్టింటికి చేరుకొని భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భర్తతోపాటు అతడి తల్లిదండ్రులను వారికి సహకరించిన బంధువులపైనా కేసు నమోదు చేశారు.
Also Read: Hyderabad Kidney Racket: కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు..
పుదుచ్చేరికి చెందిన యువతి ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. అదే సంస్థలో పనిచేస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. 2021లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన కొన్ని వారాల తరువాత కట్నంగా ఇచ్చిన నగలను అత్త తీసుకోగా.. మరో 50 సవర్ల బంగారు ఆభరణాలు తీసుకురావాలంటూ భర్త ఇబ్బందులు పెట్టేవాడు. క్రమంగా భర్త వేధింపులు రోజురోజుకు తీవ్రమవుతూ వచ్చాయి. నీ పుట్టింటి ఆస్తినిసైతం నా పేరుపై రాయించాలంటూ ఇబ్బందులు పెట్టేవాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో తాను పెంచుకున్న ఆఫ్రికన్ జాతి పక్షి ముక్కుతో పొడిపించి చిత్ర హింసలకు గురిచేసేవాడు. భర్తకుతోడు అతని తల్లిదండ్రులు కూడా తోడుకావడంతో ఆ యువతి వారుపెట్టే ఇబ్బందులను భరించలేక పోయింది. వారి నుంచి తప్పించుకొని పుట్టింటికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకిదిగి భర్త, అత్తమామలపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారికి సహకరించిన బంధువులపైనా కేసులు నమోదు చేశారు.