MCOCA Case : ఆప్ మాజీ MLA బెయిల్ పిటిషన్.. విచారణ నుంచి తప్పుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
MCOCA Case : ఆప్ మాజీ ఎమ్మెల్యే బెయిల్ పిటిషన్ విచారణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
In MCOCA Case Justice Swarana Kanta Sharma Recuse From Hearing Former AAP MLA Naresh Balyan Bail Plea
MCOCA Case : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆప్ మాజీ ఎమ్మెల్యే బెయిల్ మంజూరు కేసు నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే అంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నియంత్రణ చట్టం (MCOCA), 1999 కింద నమోదైన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సోమవారం ప్రకటించారు. ఈ కేసు విచారణ నుండి జస్టిస్ శర్మ తప్పుకోవడంతో.. ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 23న మరో న్యాయమూర్తి ముందు విచారణకు జాబితా చేయనున్నారు.
ఈ కేసు నుండి వైదొలగడానికి న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ఎలాంటి కారణాలు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య పోటీ చేస్తుందని.. ఆమెకు “మార్గనిర్దేశం” చేసేందుకు వీలుగా కస్టడీ పెరోల్‌పై తనను విడుదల చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బల్యాన్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరిలో కోఆర్డినేట్ బెంచ్ తిరస్కరించింది. బల్యాన్ ప్రస్తుతం మండోలి జైలులో న్యాయ విచారణలో (జుడీషియల్ కస్టడీ) ఉన్నారు. గ్యాంగ్‌స్టర్ కపిల్ సాంగ్వాన్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పబడుతున్న ఒక వ్యవస్థీకృత నేర సిండికేట్‌తో ఈ కేసుకు సంబంధం ఉంది.
అంతకుముందు, జనవరి 15, 2024న ట్రయల్ కోర్టు MCOCA కేసులో బల్యాన్కు బెయిల్ నిరాకరించింది. ఒక వ్యవస్థీకృత నేర సిండికేట్‌తో అతనికి సంబంధం ఉన్నట్లు కీలకమైన ఆధారాలు ఉన్నాయని కోర్టు గమనించింది. బల్యాన్ ఆ గ్రూపులో సభ్యుడిగా.. వారు చేస్తోన్న చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు ట్రయల్ కోర్టు పేర్కొంది. రాజధాని అంతటా దోపిడీలు, హింస, ఇతర నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో సాంగ్వాన్ సిండికేట్ సభ్యులపై ఢిల్లీ పోలీసులు 16 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బల్యాన్ ఈ వ్యవస్థీకృత నేర సిండికేట్‌లో “సహాయకుడిగా” ఉన్నారని ఆరోపిస్తూ ప్రాసిక్యూషన్ అతని బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టులో వ్యతిరేకించింది.
