నిర్మానుష్యంగా మారిన గాల్వాన్ లోయ.. 2కి.మీల వెనక్కితగ్గిన బలగాలు

బోర్డర్లో టెంట్లు తీసేసినంత మాత్రాన.. చైనా మంచిదైపోతుందా0.? వెనక్కి తగ్గితే.. మళ్లీ ముందుకు రాదని నమ్మకమేంటి? LAC దాటొచ్చిన చైనా .. ఇండియాపైనే దుష్ప్రచారం మొదలుపెట్టింది. సో.. చైనా విక్టిమ్ కార్డ్‌ను.. ఇండియా ఎలా టాకిల్ చేస్తుంది.? బలగాలు వెనక్కి తగ్గాక.. బఫర్‌జోన్ ఎలా ఉంది?
గల్వాన్‌లో చైనా బలగాలు వెనక్కి తగ్గాయ్.. టెంట్లు, క్యాంపులు మార్చేశారు. దాదాపు 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లిపోవడంతో 3, 4 రోజులుగా ఇదే హాట్ టాపిక్ అయింది. ఇప్పుడా వార్తలను నిజం చేస్తూ.. కొన్ని శాటిలైట్ ఇమేజెస్ రిలీజ్ అయ్యాయి. అందులో.. నిజంగానే చైనా తన క్యాంపుల్ని తొలగించినట్లు తెలిసింది. ఐతే.. అంతా క్లియర్ అయిపోయినట్లేనా.. ఇప్పుడు బోర్డర్లో ఉన్న తాజా పరిస్థితేంటి? చైనాను నమ్మొచ్చా?
ఇండియాతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి పెరుగుతున్న ఒత్తిడితో.. లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ నుంచి.. పీపుల్ లిబరేషన్ ఆర్మీ వెనక్కి తగ్గింది. LAC నుంచి.. చైనా సైన్యం దాదాపు 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లింది. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, క్యాంపులను కూడా తొలగించింది. చైనాను నమ్మని ఇండియా.. మరోసారి క్రాస్ చెక్ చేసుకుంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కన్ఫార్మ్ చేసుకుంది. జూన్ 28, జులై 6 నాటి శాటిలైట్ ఇమేజెస్‌ను పరిశీలిస్తే.. చైనా సైన్యం నిజంగానే పెట్రోలింగ్ పాయింట్ 14 నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు స్పష్టం అయింది.
జూన్ 28 నాటి శాటిలైట్ ఇమేజ్‌లో.. LAC వెంబడి.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వేసిన టెంట్లు, క్యాంపులు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఐతే.. జులై 6 నాటి శాటిలైట్ చిత్రాల్లో.. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. దీనిని బట్టి చూస్తే.. నిజంగానే.. చైనా బలగాలు అక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లిపోయాయన్న విషయం అర్థమవుతోంది. ఈ శాటిలైట్ చిత్రాలను.. అమెరికాకు చెందిన మక్సర్ అనే శాటిలైట్ ఇమేజరీ కంపెనీ రిలీజ్ చేసింది.
2 నెలల పాటు ఇండో-చైనా బోర్డర్లో.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన గల్వాన్ లోయతో పాటు హాట్ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల నుంచి కూడా చైనా సైనికులు వెనక్కి వెళ్లారు. హాట్ స్ప్రింగ్స్ దగ్గరున్న పెట్రోలింగ్ పాయింట్ 15 నుంచి.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ట్రూప్స్.. 2 కిలోమీటర్లకు పైగా వెనక్కి వెళ్లాయ్. గోగ్రాలోని పెట్రోలింగ్ పాయింట్ 17 నుంచి కూడా చైనా బలగాలు క్రమంగా వెనక్కి తగ్గుతాయని ఆర్మీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
భారత బలగాలు కూడా ఉద్రిక్తతలకు కారణమైన.. ఈ మూడు కీలక ప్రాంతాల నుంచి వెనక్కి వచ్చేశాయ్. ఇండియన్ సోల్జర్స్ కూడా 2 కిలోమీటర్లు వెనక్కి వచ్చేశారు. దీంతో.. రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణలు తలెత్తిన.. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, గల్వాన్ వ్యాలీ ప్రదేశాలు.. ఇప్పుడు జీరో ఆర్మీ ప్లేసెస్‌గా మారిపోయాయ్.
జూన్ 30న రెండు దేశాల కోర్ కమాండర్ల మధ్య మూడో మీటింగ్ జరిగింది. ఇందులో.. రెండు వైపులా ఇరుదేశాల సైన్యం 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్లాలని నిర్ణయించారు. దీంతో పాటు.. బోర్డర్‌లో బలగాల ఉపసంహరణతో పాటు ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనే దిశగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య ఫోన్‌లో చర్చలు జరిగినట్లు.. భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. చర్చల తర్వాతే.. ఇటు భారత్, అటు చైనా.. వాస్తవాధీన రేఖ నుంచి బలగాలను వెనక్కి రప్పించేందుకు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
జూన్ 30 నాటి.. కమాండర్ల మీటింగ్, అజిత్ దోవన్ ఫోన్ కాల్ తర్వాత.. జులై 6 నుంచి డ్రాగన్ బలగాలు వెనకడుగు వేస్తున్నాయ్. చైనీస్ బలగాలను కదలికలను.. ఓ కంట కనిపెడుతూనే సైనికులు కూడా సరిహద్దు నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. ఐతే.. పాంగాంగ్ లేక్ దగ్గర మాత్రం చైనా తన సైన్యాన్ని అలాగే ఉంచింది. పైగా ఇక్కడ వందల్లో నిర్మాణాలు చేపట్టింది. త్వరలోనే రెండు దేశాల టాప్ కమాండర్ల స్థాయిలో మరో మీటింగ్ జరగనుంది. అప్పటిలోగా.. చైనీస్ ట్రూప్స్.. పాంగాంగ్ లేక్‌ను కూడా ఖాళీ చేస్తాయా.. లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
ప్రస్తుతం LAC దగ్గర.. చైనా వైపు 2 కిలోమీటర్లు, ఇండియా వైపు 2 కిలోమీటర్లు.. రెండు దేశాల సైన్యం వెనక్కి వెళ్లింది. దీంతో.. గల్వాన్ వ్యాలీలో.. మొత్తం 4 కిలోమీటర్ల ప్రాంతం బఫర్ జోన్‌గా కొనసాగుతోంది. ఈ ప్రాంతమే.. జూన్ 15న.. ఇండియా-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణకు వేదికైంది. ఈ ఘర్షణలో.. భారత సైనికులు 20 మంది అమరులయ్యారు. చైనా వైపు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని.. 45 మంది దాకా భారత వీరజవాన్ల చేతిలో హతమయ్యారని చెబుతున్నారు. కానీ.. చైనా మాత్రం దీనిని కన్‌ఫార్మ్ చేయలేదు.
ఐతే.. గల్వాన్‌లో LAC వెంబడి క్రియేట్ చేసిన బఫర్‌జోన్‌లో.. ఇండియా-చైనా ఆర్మీ తాత్కాలికంగా పాట్రోలింగ్ చేపట్టొద్దని నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇదే బెటర్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ.. మరికొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. పాట్రోలింగ్ హక్కులను తాత్కాలికంగా తగ్గించడం వల్ల.. భారతీయ ఉనికిని, నియంత్రణను బలహీనపరిచేదిగా ఈ నిర్ణయం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. గల్వాన్ నుంచి చైనీస్ ట్రూప్స్ వెనక్కి తగ్గినా.. భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆర్మీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.