India Pakistan War: పాకిస్థాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టేందుకు భారత్ భారీ వ్యూహం.. ఇక పాక్ ఖేల్‌ ఖతం.!

పాకిస్థాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు రచిస్తోంది.

India Pakistan War: జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సైనిక చర్యలకు అన్నివిధాల రంగం సిద్ధం చేస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు పాకిస్థాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు రచిస్తోంది.

Also Read: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర.. ప్రస్తుతం కిలో ధర ఎంతుందంటే?

పాకిస్థాన్ పై రెండు ఆర్థిక దాడులకు భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రేలిస్టులోకి పాకిస్థాన్ ను చేర్చడానికి భారత్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ జాబితాలోకి చేరుస్తుంది. గతంలో పాకిస్థాన్ దేశం ఈ జాబితాలో ఉంది. అయితే, 2022లో దాదాపు నాలుగేళ్ల తరువాత అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ కు ఊరట లభించింది. గ్రే లిస్టు నుంచి పాకిస్థాన్ దేశాన్ని ఎఫ్ఏటీఎఫ్ తొలగించింది. ప్రస్తుతం అదే జాబితాలో పాకిస్థాన్ దేశాన్ని చేర్చేలా అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలని, తద్వారా పాకిస్థాన్ దేశానికి అందే ఆర్థిక సహాయంకు అడ్డుకట్ట వేయాలని భారత్ ప్రయత్నాలను ప్రారంభించింది.

 

రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి పాకిస్థాన్‌కు అందే ఏడు బిలియన్‌ డాలర్ల సాయంపై భారత్ తన ఆందోళనను వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఎంఎఫ్ ద్వారా అందిన ఆర్థిక ప్యాకేజీని పాకిస్థాన్ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకోసం వినియోగిస్తుందని, తద్వారా ఆ నిధులను దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత సైనిక చర్య ద్వారా పాకిస్థాన్ బెంబేలెత్తిపోతుండగా.. మరోవైపు.. పాకిస్థాన్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడంలో భారత్ విజయవంతం అయితే పాకిస్థాన్ కు గట్టిగుణపాఠం చెప్పినట్లే అవుతుంది.

Also Read: IPL 2025: అయ్యో వైభవ్.. కాస్త ఓపిక పట్టాల్సింది.. రాహుల్ ద్రవిడ్ రియాక్షన్ వైరల్.. రోహిత్ శర్మ ఏం చేశాడంటే..