Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర.. ప్రస్తుతం కిలో ధర ఎంతుందంటే?
కుంకుమ పువ్వు.. ఈ పేరెత్తితే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కాశ్మీర్ ప్రాంతం. పహల్గాం ఉగ్రదాడి తరువాత కాశ్మీర్ లోయలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Kashmiri saffron
Pahalgam Attack: గత నెల 22న జమ్మూకశ్మీర్ ప్రాంతం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉగ్రదాడి మూలాలు పాకిస్థాన్ లో ఉన్నట్లు ఆధారాలు సేకరించిన భారత ప్రభుత్వం.. పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతోపాటు.. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయి. దీంతో పాకిస్థాన్ లో పలురకాల వస్తువుల ధరలు ఆకస్మికంగా పెరిగాయి. మరోవైపు కాశ్మీర్ లోయ ఊహించని ఆర్థిక పరిణామాలను ఎదుర్కొంటుంది.
కుంకుమ పువ్వు.. ఈ పేరెత్తితే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కాశ్మీర్ ప్రాంతం. పహల్గాం ఉగ్రదాడి తరువాత కాశ్మీర్ లోయలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇక్కడి ప్రాంతంలో కుంకుమపువ్వు ధరలలో ఒక్కసారిగా పెరుగుదల చోటు చేసుకుంది. తద్వారా చరిత్రలో సరికొత్త గరిష్ఠ స్థాయిలకు కుంకుమపువ్వు ధరలు చేరుకున్నాయి. నాణ్యమైన కాశ్మీరీ కుంకుమపువ్వు కిలో రూ. 4.25లక్షల నుంచి రూ.4.50లక్షల వరకు ఉంటుంది. కేవలం రెండు వారాల్లోనే దాని ధర దాదాపు రూ. 50వేల నుంచి రూ.75వేల వరకు పెరిగి రూ. 5లక్షల మార్కును దాటేసింది.
భారతదేశంలో ప్రతీయేటా 55టన్నుల కుంకుమ పువ్వును వినియోగిస్తారు. కాశ్మీర్ లోని ఎత్తైన ప్రదేశాలు పుల్వామా, పాంపోర్, బుడ్గామ్, శ్రీనగర్, జమ్మూ ప్రాంతంలోని కిష్త్వార్ వరకు కుంకుమ పువ్వు సాగు విస్తరించి ఉంది. సంవత్సరానికి ఆరు నుంచి ఏడు టన్నులు మాత్రమే దిగుబడిని ఇస్తాయి. మిగిలిన కుంకుమ పువ్వు ఆప్ఘనిస్థాన్, ఇరాన్ దేశాల నుంచి భారతదేశంలోకి దిగుమతి జరుగుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దులను మూసివేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి.
పాక్, భారత్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినడంతో ఆఫ్ఘనిస్థాన్ నుంచి కుంకుమ పువ్వు ఎగుమతులు నిలిచిపోయాయి. తద్వారా కుంకుమ పువ్వు ధరలు నాలుగు రోజుల్లోనే 10శాతం పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యవసాయ ఉత్పత్తిగా కుంకుమపువ్వును పరిగణిస్తారు. ప్రస్తుతం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కుంకుమ పువ్వు ధర మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.