కరోనా టెన్షన్…ఇరాన్ నుంచి క్షేమంగా భారత్ చేరుకున్న మొదటి బ్యాచ్

  • Published By: venkaiahnaidu ,Published On : March 10, 2020 / 03:40 PM IST
కరోనా టెన్షన్…ఇరాన్ నుంచి క్షేమంగా భారత్ చేరుకున్న మొదటి బ్యాచ్

Updated On : March 10, 2020 / 3:40 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్ దేశంలో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను మంగళవారం(మార్చి-10,2020) భారతవాయుసేన ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న హిండన్ ఎయిర్ బేస్ కి తీసుకువచ్చారు. భారత వాయుసేనకు చెందిన C-17 విమానంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ విమానాశ్రయం నుంచి మొదటి బ్యాచ్ లో భాగంగా 58 మందితో భారతీయులు(25మంది పురుషులు,31మంది మహిళలు) హిండన్ వాయుసేన కేంద్రానికి తీసుకువచ్చినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు.

ఇరాన్ దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్నందున టెహ్రాన్ లోని భారత రాయబార కార్యాలయం అధికారులు, ఇరాన్ అధికారుల సహకారంతో 58 మంది భారతీయులను వాయుసేన విమానంలో తీసుకువచ్చారు. వాయుసేన విమానంలో ప్రత్యేకంగా నలుగురు వైద్యులను కూడా పంపించారు. అంతేకాకుండా C-17 విమానం ఇరాన్ నుంచి 529మంది బ్లడ్ శాంపిల్స్ కూడా టెస్ట్ ల కోసం తీసుకొచ్చింది. ఇరాన్ నుంచి వచ్చిన భారతీయులందరినీ హిండన్ ఎయిర్ బేస్ లో క్వార్టైన్(దిగ్భందనం)చేశారు. IAF అవసరమైన వైద్య ప్రోటోకాల్‌లను యాక్టివేట్ చేసింది. తోటి పౌరులకు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు మరియు సహాయాన్ని అందించడానికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసింది.

ఇరాన్ దేశంలోని క్వామ్ నగరంలో మరో 40 మంది భారత పౌరులుండటంతో వారికి వైద్యసహాయం చేసేందుకు న్యూఢిల్లీ నుంచి వైద్యుల బృందాన్ని పంపించారు. భారతీయుల్లో కేవలం ఒకరికి మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చిందని, ప్రత్యేక వైద్యకేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నామని ఇరాన్ వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కరోనా వైరస్ లక్షణాలు లేని వారిని మాత్రమే భారత దేశానికి వాయుసేన విమానంలో పంపించామని ఇరాన్ వైద్యాధికారులు చెప్పారు.

ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడిచిన 24గంటల్లో ఇరాన్ లో 54 కరోనా మరణాలు నమోదైనట్లు మంగళవారం(మార్చి-10,2020)ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ లో కరోనా కేసలు నమోదైనప్పటి నుంచి ఒక్క రోజులో అత్యధిక మరణాలు సంభవిం,డం ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు తెలిపారు. ఇరాన్ లో కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 291కి చేరినట్లు ఇరాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రతినిధి కియానోష్ జహన్ పౌర్ తెలిపారు. కొత్తగా 881మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయినట్లు ఆయన తెలిపారు.ఇరాన్ లో ఇప్పటివరకు 8వేల 42మంది కరోనా సోకి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు ఆయన తెలిపారు.