భారత ఆర్మీ వైద్యులు మరో ఘనత : 16 వేల అడుగుల ఎత్తులో జవాన్‌కు శస్త్రచికిత్స

  • Published By: bheemraj ,Published On : November 2, 2020 / 02:47 AM IST
భారత ఆర్మీ వైద్యులు మరో ఘనత : 16 వేల అడుగుల ఎత్తులో జవాన్‌కు శస్త్రచికిత్స

Updated On : November 2, 2020 / 7:44 AM IST

Indian Army doctors surgery : భారత ఆర్మీకి చెందిన వైద్యులు మరో ఘనత సాధించారు. అతి శీతల వాతావరణంలో 16 వేల అడుగుల ఎత్తులో విధులు నిర్వహిస్తున్న ఒక జవాన్‌కు సరిహద్దులోనే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. తూర్పు లఢక్‌ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న ఒక జవాన్‌ అక్టోబర్‌ 28న అపెండిక్స్‌తో బాధపడ్డాడు.



అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆ జవాన్‌ను అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తరలించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సరిహద్దులో సైనికులకు చికిత్స అందించే వైద్య శిబిరం వద్దనే ఆర్మీ వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి అపెండిక్స్‌ను తొలగించారు. సర్జరీ విజయవంతం కావడంతో ప్రస్తుతం ఆ జవాన్‌ కోలుకుంటున్నాడు.



సరిహద్దుల వద్ద జవాన్లకు శస్త్రచికిత్స నిర్వహించడం చాలా అరుదని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సరిహద్దులోని సైనిక వైద్య శిబిరాలు అత్యవసర వైద్య చికిత్సలకు కూడా సిద్ధంగా ఉన్నాయన్నది దీని ద్వారా నిర్థారణ అయ్యిందన్నారు.



లఢక్‌ సరిహద్దులో చైనాతో ఘర్షణ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ ఇటీవల పలుసార్లు సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. చలికాలం నేపథ్యంలో జవాన్లు అక్కడి ప్రతికూల పరిస్థితులను, వాతావరణాన్ని తట్టుకునేలా వెచ్చని దుస్తులు, నివాస సౌకర్యాలను కల్పించడంపై దృష్టి పెట్టారు.