సెల్యూట్ జవాన్ : మంచువర్షంలో వృద్ధుడిని కాపాడారు

  • Published By: madhu ,Published On : January 17, 2020 / 07:30 AM IST
సెల్యూట్ జవాన్ : మంచువర్షంలో వృద్ధుడిని కాపాడారు

Updated On : January 17, 2020 / 7:30 AM IST

జమ్మూ కాశ్మీర్‌లో వాతావరణ పరిస్థితులు దారుణంగా పడిపోయాయి. ఇక్కడ మంచు వర్షం మరణశాసనం లిఖిస్తోంది. అందాల కొండల మాటున మృత్యుపాశం విసురుతూ మనుషులను మరణశయ్య ఎక్కిస్తోంది. స్థానికులనేకాదు సందర్శకులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జవాన్‌ల పరిస్థితి చెప్పనవసరం లేదు. కొంతమందిని రక్షించడానికి వీరు చేస్తున్న ప్రయత్నాలకు హాట్సాఫ్ చెబుతున్నారు. తాజాగా 75 సంవత్సరాలున్న ఓ వృద్ధుడిని జవాన్లు కాపాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే ఓ గర్భిణీని కాపాడిన సంగతి తెలిసిందే.

గులామ్ నబీ ఘనీ అనే వృద్దుడు లాల్ పూర ప్రాంతంలో మంచు వర్షంలో ఇరుక్కపోయాడు. జనవరి 14వ తేదీ నుంచి అక్కడే ఉండిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆర్మీ పెట్రోల్ ఇతడిని గుర్తించింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి రంగంలోకి దిగారు. వృద్ధుడున్న స్థలానికి చేరుకోవడానికి 2 కిలోమీటర్ల మేర నడిచారు. భారీగా మంచు కురుస్తున్నా జవాన్లు లెక్కచెయలేదు. గులామ్ నబీ ఘనీని రక్షించారు. అతడిని భుజాలపైకి ఎక్కించుకుని ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆర్మీ జవాన్లు వెల్లడించారు. 

మరోవైపు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో కాశ్మీర్ వాతావరణమే మారిపోయింది. మంచు వర్షం కురుస్తుండటంతో సరస్సులు గడ్డ కట్టుకుపోయాయి. నియంత్రణ రేఖ వెంట ఉన్న మంచుచరియలు మరణశాసనాలు లిఖించాయి. కేవలం రెండురోజుల వ్యవధిలో నాలుగుచోట్ల విరిగిపడటంతో ఒక్కరిద్దరు కాదు.. ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉన్నచోటే ఊపిరి వదలాల్సి వచ్చింది. ఇందులో ఆరుగురు అమాయక పౌరులతోపాటు ఆరుగురు జవాన్లు ఉండటం అత్యంత విషాదకరం. మచిల్ సెక్టార్‌లోని ఓ ఆర్మీ పోస్ట్‌పై మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఐదుగురు భారత జవాన్లు మంచుగడ్డల కింద కూరుకుపోయారు. వారిని రక్షించేందుకు చేపట్టిన చర్యలు ఫలితాన్నివ్వకపోడంతో అక్కడే ఆఖరిశ్వాస వదిలారు.