ప్రభుత్వం నిర్ణయిస్తే, కరోనా వ్యాక్సిన్ అత్యవసర ఆమోదం గురించి ఆలోచిస్తాం: ఐసీఎంఆర్

ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కాపాడేందుకు అవసరమైన వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన గురించి దేశ ప్రజలు మొత్తం ఎదురుచూస్తున్నారు. ఈ దిశగానే ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం నాటికి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తామంటూ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ సైన్సెన్స్ (ఐసీఎంఆర్) వెల్లడించింది.
ఆ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేయాలంటూ భారత్ బయోటెక్‌కు ఐసీఎంఆర్ లేఖ కూడా రాయగా.. చివరికి నిరాశే ఎదురైంది. మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయంటూ ప్రధాని మోడీ ప్రకటించారే తప్ప అవి ఎప్పటికి అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఇటువంటి పరిస్థితిలో మరోసారి ఐసీఎంఆర్ ఓ కీలక ప్రకటన చేసింది.
ప్రభుత్వం కోరుకుంటే టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు అత్యవసర అధికారాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఐసిఎంఆర్ చీఫ్ బుధవారం పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే, వ్యాక్సిన్‌ను ఒక లాంఛనప్రాయ రూపాన్ని తీసుకోవటానికి నిర్ణయించిన అన్ని ప్రోటోకాల్‌లను సడలించడం ద్వారా, వ్యాక్సిన్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే, ఐసిఎంఆర్ దీనిని పరిశీలిస్తుంది. దేశంలో తయారవుతున్న 2 కరోనా వ్యాక్సిన్లు ఫేజ్ -2 దశలో ముఖ్యమైన క్లినికల్ ట్రయల్‌ను దాదాపుగా పూర్తి చేశాయని ఐసీఎంఆర్ తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో వ్యాక్సిన్‌కు అత్యవసరంగా ఆమోదం తెలిపే అంశాన్ని ఐసీఎంఆర్ పరిశీలిస్తుంది.
మహమ్మారిని ఎదుర్కోవడంలో ఐసీఎంఆర్, వైద్య బృందాలు ఎంతో కృషి చేస్తున్నాయని, దేశంలోని ఆసుపత్రులన్నింటికీ దిల్లీలోని ఎయిమ్స్ సమర్థవంతమైన సలహాలిస్తోందని పార్టీలకు అతీతంగా సభ్యులంతా ప్రశంసించారు. సమావేశంలో నాలుగు గంటలపాటు చర్చించిన అంశాలను పలువురు ఎంపీలు వెల్లడించారు.
‘‘భారత్ బయోటెక్, క్యాడిలా అభివృద్ధి చేసిన టీకా రెండో దశ క్లినికల్ పరీక్షలు త్వరలో పూర్తి కాబోతున్నాయి. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం-సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ పరీక్షలు ఈ వారం చివరలో ప్రారంభం అవుతాయని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పార్లమెంటు హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులతో అన్నారు. ఈ సమాచారాన్ని సమావేశంలో పాల్గొన్న ఒక ఎంపీ చెప్పారు.