ఇండియా స్పేస్ హీరో శుభాంశు శుక్లా స్వదేశానికి వచ్చేది ఎప్పుడంటే?
శుభాంశు శుక్లా భూమిని చేరిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందించారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా మంగళవారం భూమిపైకి వచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలోని కెలిఫోర్నియాకు సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో ఇతర సిబ్బందితో కలిసి ఆయన దిగారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోనే ఉన్నారు. శుభాంశు శుక్లా ఆగస్టు 17న భారత్‌కు రానున్నారు.
స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ నౌకలో శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన పెగ్గీ విట్‌సన్, పోలాండ్ కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ తో కలిసి యాక్సియం మిషన్ 4 పూర్తిచేశారు. ఈ నలుగురు వ్యమగాములు 20 రోజుల అంతరిక్ష యాత్ర అనంతరం భూమి వాతావరణంలో ప్రవేశించి పసిఫిక్ మహాసముద్రంలో దిగారు.
స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ డీ ఆర్బీట్ బర్న్ చేసి వారు భూమివైపునకు వచ్చారు. ముందుగా డ్రోగ్ ప్యారాచ్యూట్లు, అనంతరం ప్రధాన ప్యారాచ్యూట్లను తెరచి నీటిలో దిగే ప్రక్రియను ప్రారంభించారు. ప్యారాచ్యూట్ల సాయంతో క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రం వైపు దిగి వచ్చింది.
భూమిపైకి వచ్చాక కమాండర్ పెగ్గీ విట్‌సన్ మాట్లాడుతూ.. “థ్యాంక్యూ… తిరిగొచ్చినందుకు ఆనందంగా ఉంది” అని అన్నారు. ఈ నలుగురు జూన్ 25న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయాణించారు. 20 రోజుల అంతరిక్షయానంలో భాగంగా సుమారు 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.
శుక్లా రాకపై ప్రధాని మోదీ స్పందన
శుభాంశు శుక్లా భూమిని చేరిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందించారు. శుభాంశు శుక్లా ధైర్యం, అంకితభావం, ముందడుగు వేయాలన్న సంకల్పం దేశ ప్రజల్లో కోటి కలలు నింపాయని పేర్కొన్నారు. “అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను దేశం తరఫున ఆహ్వానిస్తున్నాను” అని మోదీ తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా ఘనత సాధించినట్లు మోదీ గుర్తుచేశారు.