IRCTC IPO షేర్లు కొనుక్కోవాలనుందా..

స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఐఆర్సీటీసీ శుభవార్త ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్-IRCTC ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్-IPO ప్రారంభమైంది. మద్దతు ధరను రూ 315 -320 ల మధ్య నిర్ణయించడం ద్వారా రూ. 645 కోట్లను సమీకరించనుంది. ఐఆర్‌సీటీసీ ఐపీఓ సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు మదుపరులకు అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వాటా 12.6 శాతం తగ్గించి మొత్తం 2 కోట్ల షేర్లను అమ్మేందుకు ఐఆర్‌సీటీసీ సిద్ధమైంది. ఐఆర్‌సీటీసీ ఐపీఓ సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే కనీసం 40 షేర్లకు బిడ్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక లాట్‌కు కనీసం రూ.12వేల 200-12వేల 400 మధ్య ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
అంతకన్నా ఎక్కువ కొనాలనుకుంటే 40, 80, 120.. ఇలా 40 షేర్ల చొప్పున కొనొచ్చు. ఫైనల్ ఆఫర్ ప్రైస్ పైన ప్రతీ షేర్‌పై రూ.10 డిస్కౌంట్ లభిస్తుంది. సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 3న ముగుస్తుంది. షేర్ల అలాట్‌మెంట్ అక్టోబర్ 9న జరిగే అవకాశముంది. ఐఆర్‌సీటీసీ షేర్ బీఎస్ఈ, ఎన్ఎస్‌ఈలో అక్టోబర్ 14న లిస్ట్ కానుంది.
ఐఆర్‌సీటీసీ అనేది యాజమాన్య పరంగా, పాలనా పరంగా పూర్తి భారతీయ రైల్వే లోని భాగం. ఈ ఇష్యూ ద్వారా వచ్చే మొత్తం సొమ్ము కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది. నూరు శాతం గా ఉన్న ప్రభుత్వ యాజమాన్య హక్కులు ఈ అమ్మకం ద్వారా 12.5 శాతం తగ్గి , 87.5 శాతం గా ఉంటాయి. మొత్తం 2.01 షేర్లలో 1.60 లక్షలను అర్హత కలిగిన ఉద్యోగులకు కేటాయించింది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి ఐఆర్‌సీటీసీ ఆదాయం 25 శాతం పెరిగి రూ .1,957 కోట్లు గా , నికర లాభం 23.5 శాతం పెరిగి రూ. 272 కోట్లు గా నమోదైంది.