ISRO Chairman Somnath : ఇస్రో ఛైర్మన్ కు పదోన్నతులు రాకుండా శివన్ అడ్డుకున్నారా? ఆత్మకథ ప్రచురణ ఎందుకు నిలిచిపోయింది
ఒక సంస్థలో ఉన్నత హోదాకు చేరుకోవాలంటే అనేక సవాళ్లను అదిగమించాల్సి ఉంటుంది. నా జీవితంలోనూ అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.

ISRO Chief Somanath
ISRO Chairman: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్ కు గతంలో పదోన్నతులు రాకుండా మాజీ చైర్మన్ కె. శివన్ అడ్డుకున్నారా? ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ రాసిన ఆత్మకథ పుస్తకంలో ఈ అంశాలను ప్రస్తావించినట్లు, శివన్ పై తన ఆత్మకథ పుస్తకంలో పలు విమర్శలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పుస్తకాన్ని త్వరలో విడుదల చేసేందుకు సోమనాథ్ సిద్ధమయ్యారు. అయితే, తాజాగా ఆయన బయోగ్రఫీ పుస్తకంపై వివాదం చెలరేగడంతో దాన్ని ప్రచురణ నుంచి వెనక్కి తీసుకున్నట్లు సోమనాథ్ తెలిపారు.
ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తన ఆటోబయోగ్రఫీ పుస్తకం రాశారు. ఆ పుస్తకం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ పుస్తకంలో ఇస్రో మాజీ చైర్మన్ కె. శివన్ పై విమర్శలు చేసినట్లు వార్తలు వచ్చాయి. నిలవు కుడిచ సింహంగళ్ (వెన్నెలను తాగిన సింహాలు) పేరుతో రాసిన ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు ఒక మలయాళ పత్రికలో ప్రచురితమయ్యాయి. పుస్తకంలో సోమనాథ్ కు పదోన్నతులు రాకుండా శివన్ అడ్డుకున్నారన్న భావన వ్యక్తమయ్యేలా కొన్ని అంశాలు ఉన్నాయని పేర్కొంది. వీటికితోడు పలు వివాదాస్పద విషయాలు ఈ పుస్తకంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సోమనాథ్ స్పందించారు. విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించారు.
Also Read : Vijayasai Reddy : పురందేశ్వరిపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి
ఒక సంస్థలో ఉన్నత హోదాకు చేరుకోవాలంటే అనేక సవాళ్లను అదిగమించాల్సి ఉంటుంది. నా జీవితంలోనూ అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. ఓ కీలక పదవికోసం అనేక మంది అర్హులు ఉంటారు.. ఆ విషయాన్నే నేను పుస్తకంలో చెప్పాలని చూశానని, ఇస్రో చైర్మన్ హోదాకు చేరుకోకుండా శివన్ తనను అడ్డుకున్నట్లు నేను ఎక్కడా చెప్పలేదని సోమనాథ్ అన్నారు. అధికారికంగా ఇంకా పుస్తకాన్ని విడుదల చేయలేదు.. తాజా వివాదం నేపథ్యంలో ఆ పుస్తక ప్రచురణను నిలిపివేయాలని నిర్ణయించినట్లు సోమనాథ్ తెలిపారు. అయితే, ఈ పుస్తకంలో చంద్రయాన్-2 వైఫల్యాన్నికూడా ప్రస్తావించినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.