PSLV-C55 Mission: PSLV C55 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. టెలీయోస్ -2, లూమోలైట్‌ -4తో ప్రయోజనాలేంటి?

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్వీ -సీ55 రాకెట్‌ ద్వారా టెలీయోస్-2, లూమోలైట్ - 4 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది.

PSLV-C55 Mission: PSLV C55 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. టెలీయోస్ -2, లూమోలైట్‌ -4తో ప్రయోజనాలేంటి?

ISRO PSLV-C55 (Image_ Twitter_ISRO)

Updated On : April 22, 2023 / 7:45 AM IST

PSLV-C55 Mission: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్వీ)-సీ55 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. శనివారం మధ్యాహ్నం 2.20గంటల సమయంలో తిరుపతి జిల్లా షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ప్రయోగం జరుగుతుంది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన టెలీయోస్ -2 (TeLEOS-2), లూమోలైట్ -4 (Lumelite-4) అనే రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపించేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు రాకెట్ ప్రయోగానికి ఇస్రో కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించింది. నిరంతరాయంగా 25.30 గంటలపాటు కొనసాగిన తరువాత పీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ISRO Recruitment : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఉద్యోగ ఖాళీల భర్తీ

టెలీయోస్ -2 (TeLEOS-2) 741 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఇది సింగపూర్ ప్రభుత్వానికి చెందింది. సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ ఏరోస్పేస్ కంపెనీ సింగపూర్ టెక్నాలజీస్ ఇంజినీరింగ్ మధ్య భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. ఇస్రో ప్రకారం.. టెలీయోస్-2 సింథటిక్ అపెర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) పెలోడ్ ను కలిగి ఉంది. అదేవిధంగా పగలు, రాత్రి, అన్ని వాతావరణ కవరేజీని అందించగలదు. ఒక మీటర్ పూర్తి పోలారిమెట్రిక్ రిజల్యూషన్‌లో ఇమేజింగ్ చేయగలదు.

ISRO: ఎల్‌వీఎమ్3 రాకెట్ ప్రయోగం విజయవంతం.. 36 ఉపగ్రహాలతో దూసుకెళ్లిన రాకెట్

లూమోలైట్ -4 (Lumelite-4) సహ ప్రయాణీకుల ఉపగ్రహంగా ప్రయోగించబడుతుంది. 16 కిలోల బరువు ఉంటుంది. ఇది హై పెర్ఫార్మెన్స్ స్పేస్ – బోర్న్ వీహెచ్ఎఫ్ డేటా ఎక్స్చేంజ్‌ను ప్రదర్శించడానికి అభివృద్ధి చేయబడిన ఒక అధునాతన ఉపగ్రహం. దీనిని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లోని శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. సింగపూర్ యొక్క ఇ- నావిగేషన్ సముద్ర భద్రతను మెరుగుపరచడం, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం లూమోలైట్ -4 లక్ష్యం.

ISRO: సత్తాచాటిన ఇస్రో.. విజయవంతంగా మేఘ-ట్రోఫికస్-1 ఉపగ్రహం ధ్వంసం

ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇస్రోకి ఇది తొలి ప్రయోగం అని తెలిపారు. ఈ సిరీస్‌లో 57వ ప్రయోగమని అన్నారు. వాణిజ్య రంగ ప్రయోగాల్లో ఇది ఐదవది. ఈ ప్రయోగం తర్వాత కీలకమైన చంద్రయాన్ -3, ఆదిత్య -ఎల్1 ప్రయోగాలు ఉంటాయని చెప్పారు. ప్రతినెలా ఒక ప్రయోగం ఉంటుందని చెప్పారు.