ISRO: సెంచరీ కొట్టిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్15..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. ఇస్రో చేపట్టిన చారిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది.

ISRO: సెంచరీ కొట్టిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్15..

ISRO

Updated On : January 29, 2025 / 7:50 AM IST

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. ఇస్రో చేపట్టిన చారిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి కొత్తరకం నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా ప్రయోగించారు. సుమారు 2,250 కిలోల బరువున్న ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని అది విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగితేలారు. ఇస్రో చైర్మన్ గా నారాయణన్ కు ఇదే మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలనూ పర్యవేక్షించారు.

Also Read: GSLV-F15 NVS-02 Mission : 100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం..! రాకెట్ లాంచ్ ఎప్పుడు, ఎలా చూడొచ్చు..

27గంటల కౌంట్ డౌన్ అనంతరం శ్రీహరికోటలోని షార్ నుంచి బుధవారం తెల్లవారు జామున 6.23 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్ ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. కొద్ది నిమిషాలకే ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. వందో ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు. నావిగేషన్ శాటిలైట్ ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని, ఈ వందో ప్రయోగం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

ఎన్వీఎస్ -02ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250కిలోలు ఉంటుంది. ఇది కొత్తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ప్రయోగం విజయవంతం తరువాత ఇస్రో చైర్మన్ నారాయణ మాట్లాడుతూ.. ఎన్వీఎస్-02 ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలందిస్తుందని చెప్పారు. ఇదిలాఉంటే.. ఇస్రో ఆధ్వర్యంలో 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలోని తొలి లాంచ్ వెహికిల్ ప్రయోగం జరిగింది. ఇప్పటి వరకు ఇస్రో చరిత్రలో 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్ష్యలోకి పంపామని పేర్కొన్నారు. ఇస్రో వందో ప్రయోగం విజయవంతం సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘