జేడీయూ నుంచి ప్రశాంత్ కిషోర్ ఔట్!…అమిత్ షా చెబితేనే చేశానన్న నితీష్

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్,బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సింహభాగం సీట్లు తమకు కేటాయిస్తేనే బీజేపీతో పొత్తు లేకుంటే లేదు అన్నట్లు ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. సీఏఏ,ఎన్ఆర్సీ వంటి విషయాల్లో మిత్రపక్షం బీజేపీపైనే యుద్ధానికి దిగుతుండటం,కాంగ్రెస్ పార్టీ వాయిస్ ను వినిపిస్తున్న ప్రశాంత్ కిషోర్ వైఖరిపై నితీష్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ఎన్నికల విషయంలో ఏకంగా బీజేపీలో నెంబర్-2గా ఉన్న అమిత్ షాపైనే ఎదురుదాడికి దిగిన ప్రశాంత్ కిషోర్ ను ఇక పార్టీ నుంచి సాగనంపాలని నిర్ణయించినట్లు మంగళవారం(జనవరి-28,2020)నితీష్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. సోమవారం పార్టీ నాయకులు,ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత నితీష్ కుమార్ మాట్లాడుతూ…ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉంటే ఓకే…వెళ్లిపోయినా కూడా ఓకే. ఎవరైనా ఇష్టమున్నంతకాలం పార్టీలో ఉండవచ్చు. పార్టీ వదిలివెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు. మాది వేరే రకమైన పార్టీ. అతను అసలు పార్టీలో ఎలా చేరాడో తెలుసా? ప్రశాంత్ ను పార్టీలో చేర్చుకోమని అమిత్ షా నాకు చెప్పాడు. అతని మనసులో ఏదో ఉండిఉండవచ్చు. అది పార్టీ వదిలిపోవాలనుకోవడం కావచ్చు.
ఇప్పటికే ఆయన వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.కానీ నేను ఒక విషయం సృష్టంగా చెబుతున్నాను. జేడీయూ పార్టీలోనే ప్రశాంత్ కిషోర్ ఉండాలనుకుంటే పార్టీ అతను పార్టీ యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని అవలంబించాల్సి ఉంటుందని నితీష్ కుమార్ అన్నారు. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ పొత్తును విమర్శించిన జేడీయూ నాయకుడు పవన్ వర్మ తీరును నితీశ్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. తనతో వ్యక్తిగత సంభాషణలను బాహాటంగా వెల్లడించిన పవన్‌కు తన ఆశీర్వాదాలు ఉంటాయని చెప్తూ, ఆయన పార్టీ మారాలనుకుంటే, వెళ్ళిపోవచ్చునని చెప్పారు.
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడాన్ని బట్టి చూస్తుంటే వాళ్లని పొమ్మనక పొగబెట్టినట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్.. వెస్ట్ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యూహకర్తగా పనిచేసేందుకు ఇప్పటికే అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసిన విషయం తెలిసిందే.