“నల్ల” రహస్యాలు వెలుగులోకి : అక్రమ వ్యాపారాల్లో అజిత్ దోవల్ కుమారులు

  • Published By: venkaiahnaidu ,Published On : January 17, 2019 / 03:59 AM IST
“నల్ల” రహస్యాలు వెలుగులోకి : అక్రమ వ్యాపారాల్లో అజిత్ దోవల్ కుమారులు

డీ కంపెనీ అంటే అందరికీ గుర్తు వచ్చే పేరు దావూద్ ఇబ్రహీం. డీ కంపెనీ     అంటే దావూద్ గ్యాంగ్ అని అందరికీ తెలుసు.కానీ జాతీయ భద్రతా సలహాదారు, ఇండియన్ జేమ్స్ బాండ్ గా పిలువబడే అజిత్ దోవల్ కుమారుల”నల్ల” రహస్యాలు వెలుగులోకి తీసుకొచ్చిన “ది కారవాన్” పత్రిక ఆయన కుమారులకు డీ కంపెనీ అని పేరు పెట్టింది. దావూద్ ను భారత్ తీసుకొచ్చే అంశంపై రెండేళ్ల క్రితం జాతీయ మీడియాలో విపరీతంగా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను ఒక నాయకుడిగా కీర్తించేవి. అయితే ఇప్పుడు ఆయన కుమారులే డీ కంపెనీ పేరుతో అపకీర్తి మూటగట్టుకుంటున్నారు. అజిత్ దోవల్ ఒక రిపోర్టులో పన్ను ఎగవేతదారులకు స్వర్గ సీమలుగా ఉన్న దీవులు, దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఆయన కుమారులే అలాంటి దీవి కేమన్ లో హెడ్జ్ ఫండ్ వ్యాపారం చేస్తున్నారు. అంటే నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తున్నారు.

 పన్ను ఎగ్గొట్టే గ్యాంగ్ లకు అడ్డా అయినా కేమన్ లో అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్ హెడ్జ్ ఫండ్ ను నిర్వహిస్తున్నట్లు ది కారవాన్ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ పత్రిక కథనం ప్రకారం..2016 నవంబర్ లో ప్రధాని మోడీ  పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్న 13 రోజుల తర్వాతే వివేక్ దోవల్ దీన్ని స్థాపించారు. మోడీ సర్కారుకు సన్నిహితంగా ఉన్న థింక్ ట్యాంక్ ఇండియా ఫౌండేషన్ హెడ్, బీజేపీ నేత శౌర్య దోవల్ నిర్వహిస్తున్న వ్యాపారాలతోనూ వివేక్ కంపెనీకి సంబంధాలున్నాయి. యూకే సిటిజన్ షిప్ కలిగిన వివేక్ దోవల్ సింగపూర్ లో నివాసముంటున్నారు. ఆక్ష్న హెడ్జ్ ఫండ్ జీఎస్ వై ఏసియా ఫండ్ కు డైరక్టరుగా ఉన్నారు. ఈ కంపెనీకి ఆయనతోపాటు డాన్ డబ్ల్యూ ఇబ్యాంక్స్, మహమ్మద్ అల్తాఫ్ ముస్లియంవీటిల్ లూ డైరక్టర్లుగా ఉన్నారు. నకిలీ ఆఫ్ షోర్ కంపెనీల వివరాలను వెల్లడించిన ప్యారడైజ్ పేపర్లలో ఇబ్యాంక్స్ పేరు ఇప్పటికే బయటికొచ్చింది.

నకిలీ కంపెనీలు స్థాపించి పెట్టుబడుల పేర్లతో నగదును కావాల్సిన చోటుకు పంపే షెల్ కంపెనీల వివరాలను బయటపెట్టిన పనామా పేపర్లు, ప్యారడైజ్ పేపర్లలోనూ పేరున్న వాకర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ..వివేక్ కంపెనీ జీఎన్ వై ఏషియా ఫండ్ కు సంరక్షణగా ఉన్నట్లు దస్తావేజుల్లో తేలింది. ఇండియాలోని శౌర్య దోవల్ కంపెనీ ఉద్యోగులు ..వివేక్ దోవల్ కంపెనీతో చాలా సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సోదరుల వ్యాపార సంబంధాలు..సౌదీ అరేబియా పాలక వంశానికి చెందిన సౌద్ కంపెనీలతో జరిపే కార్యకలాపాలు..పెద్ద ఆర్థిక సామాజ్యాన్ని నడుపుతున్నట్లు సంకేతాలిస్తున్నాయి. జీఎన్ వై ఏసియాకు జీఎన్ వై క్యాపిటల్ లిమిటెడ్ అడ్వయిజర్ గా వ్యవహరిస్తున్నట్లు గోర్డిన్ క్యాపిటల్ వెబ్ సైట్ వెల్లడిస్తుంది. జీఎన్ వై క్యాపిటల్ కు వివేక్, శర్మలు డైరక్టర్లుగా లిస్టెడ్ అయ్యారు. అయితే జీఎన్ వై ఏసియాకు కీలకమైన సీడ్ ఫండింగ్ ఎలా సమకూరుతుందో తెలియలేదు. అయితే తమ సంస్థకు మెజార్టీ సీడ్ ఫండ్ మధ్యప్రాచ్య దేశాల్లోని వ్యూహాత్మక పెట్టుబడిదారుల నుంచి సమకూరుతుందని ఓ పత్రికకు శర్మ తెలియజేశారు.

నోట్ల రద్దు అనంతరం 2016 నవంబర్ 21న కేమన్ లో ఈ కంపెనీ ప్రారంభమైంది. కాగా, 2017లో ఎఫ్ డీఐల రూపంలో కేమన్ దీవి నుంచి భారత్ కు పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం…ఆ దేశం నుంచి వచ్చిన పెట్టుబడుల్లో 2,226 శాతం పెరిగినట్లు తేలింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ దీవి నుంచి వచ్చిన డబ్బులు ఈ శతాబ్దంలోనే అధికం కావడం విశేషం.