ఢీల్లీ అల్లర్లు: ఆ నలుగురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్.. హైకోర్టు ఆదేశాలు

  • Published By: vamsi ,Published On : February 26, 2020 / 02:09 PM IST
ఢీల్లీ అల్లర్లు: ఆ నలుగురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్.. హైకోర్టు ఆదేశాలు

Updated On : February 26, 2020 / 2:09 PM IST

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ నేత‌లు చేసిన విద్వేష‌పూరిత ప్ర‌సంగాల వీడియోల‌ను కోర్టు రూమ్‌లో చూశారు ఢిల్లీ హైకోర్టు న్యాయ‌మూర్తులు. అనంతరం బీజేపీ నేత‌లు క‌పిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్‌, ప‌ర్వేశ్ వ‌ర్మ‌, అభ‌య్ వ‌ర్మ‌ల‌పై ఎఫ్ఐఆర్‌ల‌ను న‌మోదు చెయ్యాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ న‌లుగురి నేతల‌పై ఎందుకు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌కూడ‌ద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. ‘ఇంకా ఎంతమంది చనిపోవాలి. ఇంకా ఎన్ని ఇళ్లు దహనమైపోవాలి.’ అంటూ జ‌స్టిస్ ముర‌ళీధ‌ర్ ఢిల్లీ పోలీసుల‌ను ప్ర‌శ్నించారు. 

ఆ న‌లుగురు నేత‌ల్లో ఓ కేంద్ర‌మంత్రి, ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే ఉన్నారు. ఇలాంటి రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేసిన వారిపై ఎందుకు కేసులు బుక్ చేయ‌డం లేద‌ని కోర్టు ప్రశ్నించింది. ఈశాన్య ఢిల్లీలో హింస వెనుక బీజేపీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలే కారణం అంటూ దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిపిన కోర్టు.. ఈ సందర్భంగా నేతలు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. మూడు వేలకు పైగా చనిపోయిన 1984నాటి సిక్కు అల్లర్లను ప్రస్తావిస్తూ.. అప్పటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఢిల్లీలో ప్రస్తుతం ఉండే పరిస్థితిని చక్కదిద్దేందుకు వెంటనే రంగంలోకి దిగాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి మనేష్‌ సుసోడియాలు ఘర్షణలు జరిగిన ప్రాంతంలో పర్యటించి స్థానికులకు భరోసా కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. స్థానికులలో ఉన్న భయాందోళనలను దూరం చేసేలా చర్చలు జరపాలని సూచించింది.

ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి చనిపోవడం దురదృష్టకరం అని కోర్టు అభిప్రాయపడింది. సామాన్య ప్రజలకు Z కేటగిరి సెక్యూరిటీ కల్పించాల్సిన పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తుందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.