Uttarakhand Election : హైకమాండ్ పై తీవ్ర విమర్శలు..పంతం నెగ్గించుకున్న హరీష్ రావత్

వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రెండు రోజుల క్రితం కాంగ్రెస్​ అధినాయకత్వం తీరుపై ఆ పార్టీ సీనియర్​ నేత,మాజీ సీఎం హరీష్ రావత్ ట్విట్టర్ వేదికగా

Uttarakhand Election :  హైకమాండ్ పై తీవ్ర విమర్శలు..పంతం నెగ్గించుకున్న హరీష్ రావత్

Rawat

Updated On : December 24, 2021 / 5:49 PM IST

Uttarakhand Election : వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రెండు రోజుల క్రితం కాంగ్రెస్​ అధినాయకత్వం తీరుపై ఆ పార్టీ సీనియర్​ నేత,మాజీ సీఎం హరీష్ రావత్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేసి సంచలనానికి తెరలేపిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన అనంతరం హరీశ్​ రావత్ స్వరం మారింది. ఎన్నికల ప్రచార కమిటీకి తానే సారథ్యం వహించేలా అధిష్ఠానాన్ని ఒప్పించడంలో రావత్ సక్సెస్ అయ్యారు.

రాహుల్ భేటీ అనంతరం ఐక్యతా రాగం ఆలపించారు రావత్.”కలిసి ముందుకు సాగుతాం. కాంగ్రెస్​ను విజయ తీరాలకు చేర్చుతాం. నా నేతృత్వంలోనే ఉత్తరాఖండ్​ ఎన్నికలు జరుగుతాయి” అని హరీష్ రావత్ పేర్కొన్నారు. అయితే పార్టీపై అసంతృప్తి పూర్తిగా తొలగిపోయిందా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు.. అంచెలంచెలుగా జరుగుతుందని రావత్ సమాధానమిచ్చారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటనపై రావత్ ను ప్రశ్నించగా..ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవటంపై అధ్యక్షుడికి ప్రత్యేక అధికారం ఉందని రావత్ తెలిపారు​. ఎన్నికల అనంతరం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిని ఎన్నుకుంటారని పేర్కొన్నారు. రావత్​ తాజా వ్యాఖ్యలతో పార్టీ నాయకత్వంతో ఉన్న విభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తోంది.

ALSO READ Uttarakhand Election : హైకమాండ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్