Exit Poll Results: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమవుతాయా? గతంలో అనేక సార్లు ఘోరంగా విఫలం.. ఎప్పుడెప్పుడంటే?

Exit Poll Results: కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అవి నిజమవుతాయా అన్న సందేహం అందరిలోనూ ఉంది. గతంలో ఏయే ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ సరిగ్గా అంచనా వేయలేకపోయాయో చూద్దాం.

Exit Poll Results: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమవుతాయా? గతంలో అనేక సార్లు ఘోరంగా విఫలం.. ఎప్పుడెప్పుడంటే?

Karnataka Election 2023

Exit Poll Results: వచ్చే ఏడాది దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దక్షిణాదిన కాంగ్రెస్ తో పాటు బీజేపీకి కీలకమైన కర్ణాటక ఎన్నికలు (Karnataka Election 2023) బుధవారం జరిగాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ (Exit Poll Results) సంస్థలు చెబుతున్నాయి.

ఎన్నికల ప్రచార, ఓటింగ్ హడావుడి ముగిసి, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ హడావుడి మొదలైంది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉంది. ఓటర్ల నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలు తీసుకుని ఎగ్జిట్‌ పోల్స్‌ గణాంకాలు రూపొందిస్తారు. చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాలు నిజమయ్యాయి.

ఎన్నికల సంఘం వెల్లడించే ఫలితాల్లోనూ అదే రీతిలో ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ ఎల్లప్పుడూ కచ్చితమైన గణాంకాలను చెబుతాయని నమ్మలేం. గతంలో పలు రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు ప్రజల మనసులో ఏముందో, ఎవరికి ఓటేశారో తెలుసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. కొన్ని సందర్భాల్లో మెజార్టీ గురించి ఆయా సంస్థలు తెలిపిన వివరాలు కాస్త అటూ ఇటూ అయ్యాయి. ఏయే సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయో చూద్దాం…

బిహార్‌ 2015 శాసనసభ ఎన్నికలు…

బిహార్‌ లో 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఆ రాష్ట్రంలో జేడీయూ తిరిగి అధికారంలోకి రాదని అన్ని సంస్థలు పేర్కొన్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న బీజేపీ బిహార్ ఎన్నికల్లో గెలుస్తుందని ఆయా సంస్థలు చెప్పాయి.

ఆ ఎన్నికల్లో జేడీయూ, ఆర్‌జేడీతో కలిసి పోటీ చేశాయి. జేడీయూ, ఆర్జేడీ కూటమి చేతిలో బీజేపీ ఓడిపోయింది. ఎగ్జిట్‌ పోల్స్‌ లో చెప్పిన అంచనాలన్నీ విఫలమయ్యాయి. ఆ బీజేపీ కూటమికి 120 వస్తాయని, జేడీయూ కూటమికి 117 వస్తాయి, ఇతరులకి 6 సీట్లు వస్తాయని అప్పట్లో ఇండియా టుడే సిసెరో సర్వే పేర్కొంది.

టుడేస్‌ చాణక్య కూడా ఇలాంటి ఫలితాలే వెల్లడించింది. బీజేపీ కూటమికి 155, జేడీయూ-ఆర్జేడీ కూటమికి 83 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతర పలు సంస్థలు కూడా ఇటువంటి అంచనాలే వేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 58 సీట్లు మాత్రమే రాగా, జేడీయూ కూటమి 178 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

దిల్లీ 2015 శాసనసభ ఎన్నికలు..

ఈ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లను గెలుచుకుని విజయ ఢంకా మోగించింది. ఆప్‌ గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినప్పటికీ, ఇంతగా మెజార్టీ వస్తుందని ఏ సంస్థ కూడా అంచనా వేయలేకపోయింది. బీజేపీకి 22, ఆప్‌కు 48 సీట్లు వస్తాయని టుడే చాణక్య అప్పట్లో పేర్కొంది. బీజేపీకి 19-27, ఆప్‌కు 38-46, కాంగ్రెస్‌కు 3-5 సీట్లు వస్తాయని ఇండియా టుడే సిసెరో తెలిపింది. మిగతా అన్ని సంస్థలు ఇదే విధంగా ఫలితాలను వెల్లడించాయి. బీజేపీ కేవలం 3 సీట్లు గెలుచుకోగా, ఆప్‌ 67 గెలుచుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది.

2017 యూపీ ఎన్నికలు
ప్రధాని మోదీ 2016లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం రావడంతో బీజేపీ 2017 ఎన్నికల్లో యూపీలో ఓడిపోతుందని చాలా మంది భావించారు. 2017లో సమాజ్‌ వాదీ పార్టీ, కాంగ్రెస్‌ కూటమి ఏర్పాటు చేశాయి. ఇండియా టుడే-ఆక్సిస్‌ సర్వే బీజేపీకి 251-279, ఎస్పీ- కాంగ్రెస్‌ కూటమికి 28-42, ఇక ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 28-42 సీట్లు వస్తాయని పేర్కొంది.

బీజేపీకి 161, ఎస్సీ-కాంగ్రెస్‌కి 141, ఇతరులకు 87 సీట్లు వస్తాయని సీవోటర్‌ చెప్పింది. బీజేపీకి 285, ఎస్పీ-కాంగ్రెస్‌ 88, ఇతరులకు 27 వస్తాయని టుడేస్‌ చాణక్య భాజపాకు అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి 325 సీట్లను గెలుచుకుంది బీజేపీ. ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమికి కేవలం 19 సీట్లు మాత్రమే వచ్చాయి.

లోక్‌సభ ఎన్నికల్లో..
లోక్‌సభ ఎన్నికల్లోనూ పలు సార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విఫలమయ్యాయి. 2004లో అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కాస్త ముందుగానే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దీంతో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో వాజ్ పేయీ ప్రభావంతో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎన్డీఏ 240-250 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొన్నాయి.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 216, ఎన్డీఏ 187 గెలుచుకున్నాయి. ఇతరులకు 137 సీట్లు దక్కాయి. దీంతో యూపీఏ సర్కారు ఏర్పడింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ కాస్త తప్పాయి. ఎన్డీఏ ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని, అయినప్పటికీ దేశంలో ప్రభుత్వాన్ని స్థాపించేటంత మెజార్టీ రాదని పేర్కొన్నాయి. అయితే, ఆ ఎన్నికల్లో ఎన్డీఏ 300కు పైగా సీట్లు గెలుచుకుంది.

ఇప్పుడు కర్ణాటకలోనూ ఓటరు తీర్పు ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పలేం. కర్ణాటక ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఈ నెల 13న ప్రకటించనుంది.

Exit polls

Karnataka Polls: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. కాంగ్రెస్, బీజేపీ, హంగ్.. ఈ మూడింటిలో ఏది నిజం?