Kalaburagi Complete Lockdown : కర్ణాటక-కలబురగి జిల్లాలో 3 రోజులు పూర్తి లాక్‌డౌన్..
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో రోజురోజుకీ కేసుల తీవ్రత పెరిగిపోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది.

Karnataka Kalaburagi To Impose 3 Day Complete Lockdown
Kalaburagi Complete Lockdown : కర్ణాటకలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలోని కలబురగి జిల్లాలో రోజురోజుకీ కేసుల తీవ్రత పెరిగిపోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది. కలబురగి జిల్లాలో మూడు రోజుల పాటు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించనుంది. మే 27 ఉదయం 6 నుండి మే 30 ఉదయం 6 వరకు మూడు రోజులు జిల్లాలో కఠినమైన లాక్ డౌన్ అమలు చేయనుంది. లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సేవలు మినహాయింపు ఉంటుందని కలబురగి డిప్యూటీ కమిషనర్ తెలిపారు. కర్ణాటకలో కొత్త ఇన్ఫెక్షన్ల కంటే COVID-19 రికవరీల సంఖ్య పెరిగిందన్నారు.
రాష్ట్రంలో సోమవారం 57,333 మంది డిశ్చార్జ్ కాగా.. 25,311 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మంగళవారం (మే 25)న 529 మంది మరణించారు. దాంతో కరోనా మరణాల సంఖ్య 25,811 కు చేరింది. రాష్ట్రంలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 24,50,215గా ఉంది. కొత్తగా నమోదైన కేసులలో 5,701 మంది బెంగళూరు అర్బన్ కు చెందినవారు ఉన్నారు. నగరంలో 34,378 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మరో 297 మంది మరణించారు.
మే 24 సాయంత్రం వరకు రాష్ట్రంలో మొత్తం 24,50,215 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 25,811 మరణాలు,19,83,948 రికవరీ అయినట్టు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,40,435గా ఉంది. పాజిటివిటీ రేటు 23.28 శాతంగా నమోదైంది. కరోనా కేసు మరణాల రేటు (CFR) 2.09 శాతంగా ఉంది.
పాజిటివ్ కేసుల జాబితాలో బెంగళూరు జిల్లా అగ్రస్థానంలో ఉండగా, మొత్తం 11,25,253, మైసూరు 1,29,415, తుమకూరు 95,428 ఉన్నాయి. రికవరీ కేసుల్లో బెంగళూరు అర్బన్ 8,86,871తో మొదటి స్థానంలో ఉంది. మైసూరు 1,12,453 మంది, తుమకూరు 70,692 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,88,16,043 శాంపిల్స్ పరీక్షించగా, సోమవారం రోజున 1,08,723 కరోనా పరీక్షలను నిర్వహించారు.