గాంధీజీ గుడి : టీ, కాఫీలే నైవేద్యాలు

తెల్లదొరల పాలనలో శతాబ్దాల తరబడి మగ్గిపోయిన భరత మాతకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తెచ్చిపెట్టిన గాంధీ ప్రతీ భారతీయుడు హృదయాల్లో కొలుదీరారు. గాంధీ పిలుపుతో అఖండ భారతావని కదిలింది. స్వాతంత్ర్య శంఖా రావం పూరించింది. అఖండ భారతావనిని ఏక తాటిపై నిలిపి ఉద్యమం సాగించిన ఘతన మహాత్మా గాంధీజీది.
ప్రతి భారతీయుడి గుండెలో చెరుగని ముద్రవేసుకున్న మహాత్ముడిని భారతీయులు గుండెల్లో గుడి కట్టి ఆరాధిస్తున్నారు. అంతేకాదు ప్రత్యక్షంగా కూడా గుడి కట్టి పూజిస్తున్నారు. గాంధీకి నిత్యం పూజలు చేస్తు దేవుడిగా కొలుస్తున్నారు. మరి ఆగుడి ఎక్కడుంది? ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
అది కర్ణాటకలోని మంగళూరు గరోది ప్రాంతం. అక్కడ శ్రీ బ్రమ్హా బైదర్కళాక్షేత్ర ఆలయం ఉంది. అదే మహాత్మా గాంధీ మందిరం. ఆ మందిరంలో దేవుడుగా పూజలందుకుంటున్నారు గాంధీజీ. శాంతి, అహింసకు ప్రతిరూపంగా భక్తులు మహాత్ముడిని పూజిస్తున్నారు. ఈ గుడిలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నైవేద్యం.
గాంధీజీని పూజించిన తరువాత గాంధీజీకి అరటి పండ్లతో పాటు టీ, కాఫీలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు రోజూ గాంధీ విగ్రహం వద్ద టీ, కాఫీ, అరటి పండ్లు ఉంచి ప్రార్థనలు చేస్తారు. 1948లో ఈ మందిరం నిర్మించారు. 2006 విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. గాంధీజీ పరమ భక్తుడు ప్రకాష్ గరోడీ. ఆయనే ప్రతీ రోజు తెల్లవారుజామున మందిరాన్నీ..ఆ చుట్టు పక్కల పరిసరాలను శుభ్రం చేస్తారు. మహాత్మా గాంధీ తన జీవితంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని, అందుకే మందిరం పరిసరాలను శుభ్రం చేస్తుంటానని ప్రకాష్ తెలిపాడు. అందుకే గాంధీజీ జయంతి అక్టోబర్ 14న ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.