Kerala Drone Surveillance
kerala : దేశంలోనే తొలిసారిగా కేరళలో డ్రోన్ పోలిసింగ్ వ్యవస్థను ప్రారంభించారు సీఎం పినరయి విజయన్. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డ్రోన్ నిఘా వ్యవస్థను కలిగిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. గురువారం (మే11,2023)న సీఎం పినరయి విజయన్ చేతులుమీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 20 జిల్లాల పోలీసులకు సీఎం ఒక్కో డ్రోన్‌ను అందించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రోన్ పైలట్లకు లైసెన్సులు పంపిణీ చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం పిననయి విజయన్ మాట్లాడుతూ.. పోలీసు బలగాల ఆధునికీకరణలో దేశంలోనే కేరళ ముందంజలో ఉందన్నారు. సమాజంలో డ్రోన్ వినియోగిం పెరిగిందని కాబట్టి డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేయటం కూడా ముఖ్యమని అన్నారు. శిక్షణ పొందిన డ్రోన్ పైలట్లు తాము నేర్చుకున్నవాటిని తోటి ఉద్యోగులకు నేర్పాలని సూచించారు.
డ్రోన్ ఆపరేషన్‌పై ప్రత్యేక శిక్షణ కోసం 25 మంది పోలీసు సిబ్బందిని మద్రాస్ ఐఐటీకి పంపారు. మరో 20 మందికి కేరళలోని డ్రోన్ ల్యాబ్‌లో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. యాంటీ డ్రోన్ వ్యవస్థ 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇతర డ్రోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోగలదని, ప్రత్యర్థుల డ్రోన్లను నాశనం చేయగలదని సైబర్‌డోమ్ నోడల్ అధికారి, ఐజీ ప్రకాశ్ తెలిపారు. డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ హానికరమైన డ్రోన్లను గుర్తించగలదని..విప్లవాత్మక విశ్లేషణల కోసం వాటి నుంచి పూర్తి డేటాను తెలుసుకోగలమని ఐపీఎస్ అధికారి ఒకరు వెల్లడించారు.