లక్షద్వీప్‌కు వెకేషన్‌ వెళ్లాలనుకుంటున్నారా.. పూర్తి వివరాలు ఇవిగో?

లక్షద్వీప్‌కు ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశం ఉండదు. కొచ్చిలో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ఉంది. అక్కడకు వెళ్లి లక్షద్వీప్ వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలి.

లక్షద్వీప్‌కు వెకేషన్‌ వెళ్లాలనుకుంటున్నారా.. పూర్తి వివరాలు ఇవిగో?

Lakshadweep tourism and history complete details here

Updated On : January 16, 2024 / 8:05 PM IST

లక్షద్వీప్.. ఈ పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగుతోంది. ఒక్కసారిగా ఈ లక్షద్వీప్ పేరు అందరి నోళ్లలో నానుతోంది. ప్రధాని మోదీ ఈ ఏడాది ఆరంభంలో లక్షద్వీప్‌‌ను పర్యటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఆ ప్రదేశం గురించి తెలుసుకోవాలన్న కోరిక పెరిగింది. అందరూ లక్షద్వీప్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నప్పటి నుంచి లవ్ ఫర్ లక్షద్వీప్ నినాదం కూడా మరోపక్క అదే రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. మాల్దీవులకు టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని మరీ లక్షద్వీప్ కు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. లక్షద్వీప్ కూడా చాలా అందమైన ద్వీపం. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే దేశానికి చెందిన అద్భుతమైన ఐల్యాండ్‌గా లక్షద్వీప్‌ ఆకర్షిస్తుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. మీరూ లక్షద్వీప్‌కు వెకేషన్‌ వెళ్లాలనుకుంటున్నారా..? ఇంతకీ లక్షద్వీప్ ప్రాంతం విశిష్టత ఏంటి..? ఎలా చేరుకోవాలి..?

గూగుల్‌‌లో తెగ వెతుకుతున్నారు
సాధారణంగా సెలబ్రిటీలు, కాస్త డబ్బున్నవారు పదే పదే మాల్దీవ్స్‌‌కు వెళ్తుంటారు. ముఖ్యంగా హనీమూన్‌‌ కపుల్స్‌‌ వెస్ట్రన్‌ కంట్రీస్‌ కంటే కూడా మనకు బడ్జెట్‌ పరంగా కన్విన్సింగ్‌గా ఉండే మాల్దీవులను ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్లు. ఇప్పుడు ఆ ట్రెండ్‌ పూర్తిగా మారుతోంది. సమ్మర్‌, వింటర్‌ అనే తేడా లేకుండా చాలామంది లక్షద్వీప్‌ ట్రిప్‌ వెళ్లడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారు. మధ్యతరగతి ప్రజలు కూడా లక్ష్యద్వీప్‌ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. లక్షద్వీప్‌‌పై మాల్దీవుల వివాదం తరువాత చాలామంది వాటి గురించి తెలుసుకుంటున్నారు. లక్షద్వీప్‌‌కు వెళ్లేందుకు ప్లాన్‌‌ చేసుకుంటున్నారు. వాటి గురించి గూగుల్‌‌లో తెగ వెతుకుతున్నారు. ఈ దీవుల కోసం ఆన్‌‌లైన్‌‌లో వెతుకుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకీ బాగా పెరుగుతోంది. జనవరి 5న ఒక్కరోజే 50వేల మంది గూగుల్‌‌లో వెతికినట్లు అంచనా. మేక్‌‌ మై ట్రిప్‌లో కూడా లక్షద్వీప్‌‌ గురించి వెతికేవాళ్ల సంఖ్య 3 వేల 400 శాతం పెరిగింది. సమ్మర్‌ వెకేషన్ కోసం చాలామంది ఇప్పట్నుంచే కూడా ప్లాన్‌ చేసుకుంటున్నారట.

వెరీ వెరీ స్పెషల్‌
బీచ్‌ వెకేషన్‌ అంటే మన దేశంలో చాలా తీర ప్రాంతాలే ఉన్నాయి. ఇటు పడమర అరేబియా సముద్రంలోని గుజరాత్‌తో మొదలు పెడితే.. దక్షిణాన కన్యాకుమారి, అటు తూర్పున బంగాళాఖాతంలోని పశ్చిమబెంగాల్‌ వరకు మన ద్వీపకల్ప భూమిలో తీరప్రాంతాలే ఎక్కువ. చాలా రాష్ట్రాలు సముద్ర తీరం వెంబడి ఉంటాయి. ఒక్కో ప్రాంతం ఒక్కో స్పెషాలిటీ . అక్కడి వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భిన్నం. అందుకే దేశవ్యాప్తంగా వెకేషన్స్‌, బీచ్‌ టూరిజానికి ఇప్పుడు రెక్కలొస్తున్నాయి. ఏమాత్రం సమయం దొరికినా అందమైన బీచ్‌‌లు, నీలి రంగు సముద్ర జలాలాల్లో సేదతీరాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే లక్షద్వీప్‌ మాత్రం వెరీ వెరీ స్పెషల్‌. అది ఐల్యాండ్‌. మనదేశంలో ఉన్న అందమైన చిన్నిచిన్ని దీవుల సముదాయం. ఐల్యాండ్‌లో బీచ్‌ టూరిజం చేయాలనుకునేవారికి మన లక్ష ద్వీప్స్‌ స్వాగతం పలుకుతోంది.

కేరళకు, లక్షద్వీప్‌కు పోలికలు
లక్షద్వీప్‌ మన దేశానికి, ప్రధానంగా కేరళ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ద్వీపాల సముదాయం. ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటించక ముందు నుంచీ కూడా అక్కడ టూరిజం ఉంది. కాకపోతే.. మోదీ రెండ్రోజులు అక్కడ గడిపేసరికి.. లక్షద్వీప్‌ టూరిజం స్పాట్‌కు వెళ్లాలనే ఉబలాటం చాలామందిలో కలుగుతోంది. లక్షద్వీప్‌ 36 దీవుల సముదాయం. అయితే ఇందులో పది దీవులు మాత్రమే నివాసయోగ్యంగా ఉంటాయి. 1956లో దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో వీటికి లక్షద్వీప్ అని పేరు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని లక్కదీవ్ అని పిలిచేవాళ్లు.

కేరళకు, లక్షద్వీప్‌కు చాలా పోలికలున్నాయి. లక్షద్వీప్‌లో ఇతర భాషలు మాట్లాడేవాళ్లున్నా.. ఎక్కువమంది మాట్లాడేది మలయాళం భాషే. పైగా భౌగోళిక పరిస్థితులు కూడా ఒకేలా ఉంటాయి. కాకపోతే కేరళ తమ రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రమోషన్‌ చేసినంతగా.. లక్షద్వీప్‌ను ప్రచారంలోకి తీసుకురాలేదు. అందుకే అక్కడ టూరిజం డెవలప్‌ కాలేదు. ఇప్పుడిప్పుడే లక్షద్వీప్‌ గురించి దేశంలోని పర్యాటకులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.

36 చిన్న చిన్న ఐల్యాండ్స్‌
ఒకటో శతాబ్దంలో ఓ గ్రీక్‌ సెయిలర్‌ లక్షద్వీప్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. 7వ శతాబ్దంలో ముస్లిం మిషనరీ యాక్టివిటీస్‌ ఎక్కువగా జరిగాయి. 16వ శతాబ్దంలో పోర్చుగీసు, డచ్‌ వాళ్ల ఆధిపత్యం పెరిగింది. ట్రేడింగ్‌ మొదలు పెట్టారు. 17వ శతాబ్దంలో లక్షద్వీప్‌ బ్రిటీష్‌ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్లింది. స్వాతంత్ర్యం తర్వాత లక్షద్వీప్‌ కేరళలో విలీనం అయ్యింది. ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతం హోదా వచ్చింది. లక్షద్వీప్‌లో మొత్తం 36 చిన్న చిన్న ఐల్యాండ్స్‌ ఉన్నాయి. చేపలు పట్టడం, కొబ్బరి సాగు ఇక్కడ ప్రధాన వృత్తులు. జనాభా లక్ష లోపే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం చొరవతో బీచ్‌ టూరిజం వృద్ధి చెందుతోంది. ఇక్కడ మౌలిక వసతులు, కొత్త పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. స్థానికులకు టూరిజం ద్వారా ఆదాయం పెంచడంతో పాటు.. ప్రభుత్వానికి కూడా పర్యాటకం పరంగా ఆదాయం తెచ్చిపెట్టాలనేది కేంద్రం ఆలోచనగా ఉంది.

లక్షద్వీప్‌లోని ద్వీపాలు
లక్షద్వీప్ అనే పదానికి సంస్కృతం, మలయాళంలో లక్ష ద్వీపాలు అని అర్థం. లక్షద్వీప్‌లోని 36 ద్వీపాలలో మినియన్, కల్పిని, కద్మత్, గోల్డెన్, తిన్నాకరా.. చాలా ఫేమస్. ఇక్కడ ఎంతోమంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ద్వీపాల సమూహంలో ఆంద్రోత్​, కవరత్తి, కల్పేని, అమేని, అగత్తి ద్వీపాలు టూరిజం పరకంగా ముఖ్యమైనవి.

గోల్డెన్ ఐల్యాండ్‌.. దీన్ని బంగారు ద్వీపం అంటారు. ఇది ఒక చిన్న కన్నీటి చుక్క ఆకారంలో ఉండే ద్వీపం. ఇది అగత్తి, కవరత్తికి దగ్గరగా ఉంది. లక్షద్వీప్‌‌లో జనావాసాలు లేని ఏకైక ఐలాండ్ రిసార్ట్. రాత్రి టైంలో ఇసుక మెరుస్తుండటం ఇక్కడి స్పెషాలిటీ.

అగత్తి.. ఈ ఐల్యాండ్‌ లక్షద్వీప్‌లో అత్యంత అందమైంది. అంతే కాదు.. లక్షద్వీప్‌‌లో ఎయిర్‌‌స్ట్రిప్‌‌ను కలిగి ఉన్న ఏకైక ద్వీపం అగత్తి.

కద్మత్ ఐల్యాండ్‌.. ఇది 8 కిలోమీటర్ల పొడవు, 550 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనికి పశ్చిమాన సముద్రం తక్కువ లోతు ఉంటుంది. వాటర్ స్పోర్ట్స్‌‌కి ఇది బెస్ట్ చాయిస్‌‌.

మినీకాయ్.. ఈ ఐల్యాండ్‌ మెయిన్ గ్రూప్‌‌కి కాస్త దూరంగా ఉంటుంది. దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 11 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ వాటిని అవా అని పిలుస్తారు, ప్రతి అవాకు బోడుకాక్ అనే గ్రామ పెద్ద అధ్యక్షత వహిస్తాడు.
కల్పేని ఐల్యాండ్‌. తిలక్కం, పిట్టి అనే రెండు చిన్న ద్వీపాలు, జనావాసాలు లేని చెరియమ్ ద్వీపంతో కలిపి కల్పేని ఐల్యాండ్‌ అని పిలుస్తారు.

కవరత్తి.. ఇది చాలా ముఖ్యమైన ఐల్యాండ్‌. పరిపాలనా పరంగా కూడా ప్రధానమైంది. ఇక్కడ లక్షద్వీప్‌‌ పరిపాలనా ఆఫీస్‌‌లు ఉంటాయి. వీటన్నింటిలో ఇదే డెవలప్‌‌డ్‌‌ ఐలాండ్‌‌.
లక్షద్వీప్‌ ఇంకా చాలా టూరిజం స్పాట్‌లు ఉన్నాయి. లక్షద్వీప్‌‌లోని మినీకాయ్‌‌లో 8 మీటర్ల లోతులో మూడు పెద్ద ఓడల శిథిలాలు ఉన్నాయి. ఇక్కడ కనిపించే చేప జాతులు ఇతర చోట్ల కనిపించే చేపల కంటే పెద్దగా ఉంటాయి. శిథిలాల ఫెర్రస్ వల్ల ఇలా ఉన్నాయని నమ్ముతున్నారు.

వాటర్ స్పోర్ట్స్‌‌ కోసం చాలా టూరిస్ట్ ప్యాకేజీలు ఉన్నాయి. కయాకింగ్​, క్యానోయిస్‌‌, పెడల్ బోట్లు, సాయిల్‌‌ బోట్స్‌‌, విండ్ సర్ఫర్‌‌లు, గ్లాస్-బాటమ్ బోట్లు అందుబాటులో ఉన్నాయి. సముద్రంలో లోతుగా వెళ్లి డీప్-సీ ఫిషింగ్ కూడా చేయొచ్చు. పడవలను అద్దెకు తీసుకోవచ్చు.

ఇండియాలోనే అందమైన డైవింగ్ ప్లేస్‌‌ కద్మత్‌‌లో ఉంది. ఇదే మొదటి లక్కదీవ్స్ డైవ్ సెంటర్. డైవ్ స్కూల్ కూడా ఉంది. అక్టోబర్ 1 నుండి మే 1 వరకు ఇక్కడ ట్రైనింగ్‌‌ ఇస్తారు. మినీకాయ్ డైవ్ సెంటర్, డాల్ఫిన్ డైవ్ సెంటర్ కవరత్తిలో ఉన్నాయి.

లక్షద్వీప్‌కు ఎలా వెళ్లాలంటే..!
లక్షద్వీప్‌కు ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశం ఉండదు. కొచ్చిలో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ఉంది. అక్కడకు వెళ్లి లక్షద్వీప్ వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలి. మొదట ఇంటర్నెట్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ పొందాలి. క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్నాక ఎంట్రీ పర్మిట్లు కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కుదరకపోతే కొచ్చిలోని విల్లింగ్టన్ ఐల్యాండ్‌లో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయం ఉంది. అక్కడకు వెళ్లి పర్మిట్లు తీసుకోవచ్చు. లక్షద్వీప్ చేరుకున్నాక ఈ ఎంట్రీ పర్మిట్లను అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఇవ్వాలి. అప్పుడు మీరు లక్షద్వీప్‌లో హ్యాపీగా పర్యటించొచ్చు.

లక్షద్వీప్‌‌‌‌ వెళ్లేందుకు నేరుగా రోడ్డు, రైలు మార్గాలు లేవు. అక్కడికి వెళ్లాలంటే వాయు, జలమార్గాల్లో వెళ్లొచ్చు. కేరళ తీరానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో లక్షద్వీప్ ఉంది. కాబట్టి, అరేబియా సముద్రంలోని ఈ దీవులకు వెళ్లాలంటే ముందుగా కేరళలోని కొచ్చికి వెళ్లాలి. కొచ్చి నుంచి ఓడలు, బోట్లు, విమానాలు, హెలికాప్టర్లలో లక్షద్వీప్‌‌కి వెళ్లొచ్చు. ఇక కొచ్చికి చేరుకోవడానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి.

కొచ్చికి ప్రధాన నగరాల నుంచి ట్రైన్, ఫ్లైట్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కొచ్చి నుంచి లక్షద్వీప్ కు విమానాలు, షిప్పులు ఉన్నాయి. ఎయిర్ ఇండియా.. కొచ్చి నుంచి లక్షద్వీప్ కు విమానాలను నడుపుతోంది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా కూడా మొదట కొచ్చిని చేరుకుంటేనే.. లక్షద్వీప్ వెళ్ళగలరు. రోడ్డు మార్గం తీసుకుంటే.. ముంబయి, కోజికోడ్, మంగళూరు, బెంగళూరు, చెన్నై, గోవాలను కలుపుతూ వెళ్లే జాతీయ రహదారిపై కొచ్చి ఉంది. కాబట్టి ఈ నగరాలన్నింటి నుంచి రోడ్డు జర్నీ చేసి కొచ్చికి వెళ్లొచ్చు. ఇదంతా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొచ్చికి చేరుకునే మార్గం.

కొచ్చికి చాలా ప్రాంతాల నుంచి రైళ్లు నడుస్తున్నాయి. కొచ్చికి వెళ్లాలంటే దగ్గరలో ఉండే ఎర్నాకులం టౌన్ లేదా ఎర్నాకులం జంక్షన్ రైల్వే స్టేష‌‌న్‌‌కు వెళ్లాలి. హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ నాంపల్లి నుంచి కేరళలోని ఎర్నాకులం జంక్షన్‌కు శబరి ఎక్స్‌‌ప్రెస్ ప్రతి రోజూ ఉంది. జర్నీ టైం 24 గంటల. విజయవాడ నుంచి దాదాపు ఏడు రైళ్లు కేరళకు వెళ్తాయి. వీటిలో కేరళ ఎక్స్‌‌ప్రెస్, అలప్పి ఎక్స్‌‌ప్రెస్ రోజూ నడుస్తుంది. విశాఖపట్నం నుంచి కేరళకు దాదాపు నాలుగు రైళ్లు ఉన్నాయి. అలప్పీ – బొకారో ఎక్స్‌‌ప్రెస్ రోజూ కేరళకు వెళ్తుంది. దాని జర్నీ టైం 28 గంటలు.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి కొచ్చికి ప్రతిరోజూ ఎయిర్​ సర్వీసులు ఉన్నాయి. కొచ్చికి వెళ్లడానికి దాదాపు నెల రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే… హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఎయిర్​ ఫేర్ సుమారు 4 వేల 500 ఉంటుంది. లక్షదీవుల్లో ఉన్న ఒకే ఒక విమానాశ్రయం అగట్టి . కొచ్చి నుంచి అగట్టీకి వెళ్లడానికి ఎయిర్​ ఫేర్​ 5 వేల 500.

కొచ్చి నుంచి లక్షద్వీప్‌‌కు పడవలు, ఓడలు, విమానాలు నడుస్తాయి. ఒకరకంగా చూస్తే లక్షద్వీప్‌‌కు కొచ్చి గేట్‌‌వే లాంటిదన్నమాట. లక్షద్వీప్‌‌లో ఉన్న విమానాశ్రయం అగత్తికి వెళ్లేందుకు కొచ్చి నుంచి గంటన్నర పడుతుంది. కొచ్చి నుంచి అగత్తికి నెల రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే కనీస ధర 5 వేల 500పైనే ఉంటుంది. జల మార్గానికొస్తే కొచ్చి నుంచి లక్షద్వీప్‌‌కు ఏడు ప్యాసింజర్​ షిప్స్​ ఉన్నాయి. ఎంవీ కవరత్తి, ఎంవీ అరేబియన్ సీ, ఎంవీ లక్షద్వీప్ సీ, ఎంవీ లాగూన్, ఎంవీ కోరల్స్, ఎంవీ అమిందివి, ఎంవీ మినీ కాయ్ అనే ఓడలు రెండు ప్రాంతాల మధ్య తిరుగుతుంటాయి.

డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌
కొచ్చి నుంచి జలమార్గాన ఓడలో లక్షద్వీప్ కు చేరుకోవచ్చు. కొచ్చి నుంచి లక్షద్వీప్ కు ఏడు నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. వీటిలోనే అందరూ లక్షద్వీప్ కు చేరుకుంటారు. లక్షద్వీప్‌లో ఏ దీవికి వెళ్లాలి అని నిర్ణయించుకునేదాన్ని బట్టి.. జలమార్గాన ఓడల్లో జర్నీ టైం14 నుంచి 18 గంటల వరకు ఉంటుంది. ఈ ఓడల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ , సెకండ్ క్లాస్ ఏసీ కేటగిరీలు ఉంటాయి. ఓడలో డాక్టర్లు కూడా ఉంటారు. ఓడను బట్టి క్లాస్‌‌ల ఆధారంగా టికెట్ రేట్లు 2వేల 200 నుంచి 6 వేల రూపాయల వరకు ఉంటాయి. నీళ్లపైన ప్రయాణిస్తూ లక్ష్యద్వీప్‌ చేరుకోవడం.. ఇదో డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌.

భూతల స్వర్గం
అరేబియా సముద్రంలో ఉన్న 36 దీవుల సమూహం లక్షద్వీప్. 32 కిలోమీటర్ల వైశాల్యం ఉండే ఈ దీవుల్లో ఉష్ణోగ్రత 22 నుంచి 36 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది భూతల స్వర్గం అనే చెప్పాలి. అందమైన సముద్ర తీరంలో ఏ సీజన్‌లోనైనా ఈ దీవులు పర్యాటకులకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. భారతదేశంలోని పర్యాటక ప్రదేశాల్లో లక్షద్వీప్‌ టూరిజం మెమొరబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తోందని అక్కడికి వెళ్లొచ్చిన పర్యాటకులు అంటున్నారు. విదేశాలకు ఏమాత్రం తీసిపోని ద్వీపాలు, రిసార్ట్‌లు, వాటర్‌ స్పోర్ట్స్‌, టూరిజం అట్రాక్షన్స్‌ ఇక్కడ కొలువై ఉన్నాయంటున్నారు. అందుకే లక్షద్వీప్‌కు ఇప్పుడు దేశీయంగానే కాకుండా విదేశీ టూరిస్టులు కూడా క్యూ కడుతున్నారు. లక్షద్వీప్‌ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలనేది కేంద్రం ముందున్న టార్గెట్‌. ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏమేం చేయొచ్చో అధికారులు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతానికి లక్షద్వీప్‌లో అగట్టి ద్వీపంలో ఎయిర్‌ స్ట్రిప్ అందుబాటులో ఉంది. అగట్టి విమానాశ్రయాన్ని దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా విస్తరిస్తున్నారు.

మినికాయ్ ఐల్యాండ్‌లో కొత్తగా ఎయిర్‌పోర్ట్
పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌లు ల్యాండ్ అయ్యేలా మినికాయ్ ఐల్యాండ్‌లో కొత్తగా ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. కమర్షియల్ ఆపరేషన్స్‌‌తో పాటు సైనిక అవసరాల కోసం కూడా ఈ ఎయిర్‌‌పోర్ట్‌‌ కట్టాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. పౌర విమానయాన సర్వీసులతో పాటు సైనిక అవసరాలకు అనుగుణంగా మిలటరీ ఎయిర్‌‌క్రాఫ్ట్, ఫైటర్ జెట్స్ టేకాఫ్, ల్యాండింగ్​లకి వీలుగా దీన్ని డెవలప్​ చేస్తారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కొన్ని చోట్ల హోటల్ ప్రాజెక్ట్‌లకూ అనుమతినిచ్చే యోచనలో కేంద్రం ఉంది. విదేశీయులు వచ్చినా సౌకర్యవంతంగా ఉండేలా పెద్దపెద్ద హోటళ్లు నిర్మించాలనే ప్లాన్స్‌ వేగవంతమయ్యాయి. టూరిజంలోని రిసార్ట్స్‌, ఫుడ్‌ , హాస్పిటాలిటీ రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించవచ్చనేది ప్రభుత్వం ఆలోచన. అందుకు తగ్గట్లే ప్రతిపాదనలు కూడా మొదలయ్యాయి. లక్షద్వీప్‌లో 2026లో రెండు తాజ్ బ్రాండెడ్ రిసార్ట్‌లను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రపంచ దిగ్గజ సంస్థ టాటా ప్రకటించింది. సుహేలీ, కద్మత్ దీవులలో రెండు రిసార్ట్ లను ఏర్పాటు చేస్తామని అంటోంది.

తాగునీటి సమస్య
ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా లక్షద్వీప్‌కి ఫ్లైట్ సర్వీస్‌లను పెంచేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అలయన్స్‌ ఎయిర్‌ సంస్థ.. అదనంగా మరి కొన్ని ఫ్లైట్‌లను నడుపుతామని ప్రకటించింది. అలయన్స్‌ ఎయిర్‌ కంపెనీ ఇప్పటికే రోజూ లక్షద్వీప్‌కి ఫ్లైట్‌ సర్వీస్‌లు నడుపుతోంది. 70 సీటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే స్పైస్‌ జెట్‌ సంస్థ కూడా లక్షద్వీప్‌కి ఫ్లైట్స్‌ నడుపుతామని వెల్లడించింది. లక్షద్వీప్‌లో తాగునీటి సమస్య ఉంది. దీంతో అక్కడ డీశాలినేషన్‌ ప్రక్రియతో మంచినీరు అందించే ప్రయత్నాలు కూడా మొదలవనున్నాయి. ఇందుకు ఇజ్రాయెల్‌ రంగంలోకి దిగింది. లక్షద్వీప్‌‌‌‌లో డీశాలినేషన్‌‌‌‌ ప్రక్రియ మొదలుపెడతామని తెలిపింది. ఈ ప్రక్రియలో సముద్రపు నీటిలోని లవణాలను తొలగించి.. వాటిని తాగేందుకు వీలుగా మారుస్తారు. దీనికోసం రివర్స్‌‌‌‌ ఆస్మాసిస్‌‌‌‌ టెక్నాలజీని వాడతారు. ఇజ్రాయెల్‌‌‌‌లో దాదాపు 25శాతం తాగునీరు డీశాలినేషన్‌‌‌‌ ప్లాంట్ల నుంచే వస్తోంది.

లక్షద్వీప్‌ కొత్త పుంతలు
దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన సంస్కృతి, ఆహారపు ఆలవాట్లను పరిగణనలోకి తీసుకుని ఇక్కడి హోటల్స్‌, రిసార్ట్స్‌ సిబ్బందిని నియమించుకుంటున్నాయి. లక్షద్వీప్‌ స్థానిక రుచులతో పాటు దేశీయ రుచులన్నింటినీ అందించేలా మెనూలు సిద్ధం చేసుకుంటున్నారు. టూరిస్టులకు గదులు, రిక్రియేషన్‌ స్పాట్స్‌కు కొదవలేకుండా చేస్తున్నారు. ఇటు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు అనువైన ప్రాంతంగా మలిచేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి టూరిజం, వాటర్‌స్పోర్ట్స్‌, హాలీడే వెకేషన్‌ స్పాట్స్‌ అంటే ముందుగా లక్షద్వీప్‌ గుర్తుకు రావాలనేది ప్రభుత్వం లక్ష్యం. విదేశాలకు వెళ్లే ఆదాయాన్ని కట్టడి చేసి దేశీయ పర్యాటకరంగం బలపడేలా చేయాలనుకుంటున్నారు. ఇటు మాల్దీవులకు చెక్‌ పెడుతూనే.. పర్యాటక రంగం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కాలని లక్షద్వీప్‌ను ఎంచుకుంది కేంద్రం. దానికి తగ్గట్లే శరవేగంగా చర్యలు కూడా చేపడుతున్నారు.