ఆన్‌లైన్‌లో వ్యసనంగా రమ్మీ.. కార్డ్ గేమ్‌తో జీవితాలు నాశనం, జీతాలు ఖాళీ..

  • Published By: vamsi ,Published On : August 29, 2020 / 07:50 AM IST
ఆన్‌లైన్‌లో వ్యసనంగా రమ్మీ.. కార్డ్ గేమ్‌తో జీవితాలు నాశనం, జీతాలు ఖాళీ..

Updated On : August 29, 2020 / 9:45 AM IST

భారతీయుల బలహీనతలను ఆసరాగా చేసుకొని పెద్ద మార్కెట్ లక్ష్యంగా అనేక విదేశీ కంపెనీలు ఆన్ లైన్ మోసాలకి దిగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆన్ లైన్ మోసంతో కోట్లు నొక్కేస్తున్నారు. ఆన్‌లైన్ వేదికగా విపరీతమైన ప్రచారం కల్పిస్తూ.. ఆన్‌లైన్ ఆహా.. అనిపించేలా యాడ్‌లు చేస్తూ సామాన్యుల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరిని ఆకర్షించి మాయ చేసి మోసం చేస్తున్నారు.



డబ్బులు పొయ్యాక గుండెలు బాదుకొని, అనేకమంది ఆత్మహత్యలు చేసుకోవడం గమనిస్తూనే ఉన్నాం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఇల్లీగల్ గేమ్ అయిన పేకాటను కూడా ఆన్‌లైన్‌లో చేర్చేసి అఫీషియల్‌గా రన్ చేస్తున్నాయి. భారత్‌లో అయితే పేకాట కానీ మరేదైనా ఇతర జూదం చట్టరిత్యా నేరం. ఎవరైనా అలా ఆడినట్లు కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. అయితే ఇవే ఆటలు ఆన్‌లైన్‌లో యధేచ్చగా సాగుతున్నాయి. ఇలాంటి గేమింగ్ కార్యకలాపాలపై ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడంతో లక్షలాది మందిగా ఆన్‌లైన్ మోసంలో బలైపోతున్నారు.

ఇటీవల వచ్చిన నివేదికలో చైనా, భారత్ కేంద్రాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న పలు సంస్థలు ఆన్ లైన్ రమ్మీ పేరిట దాదాపు రూ.2వేల కోట్లు కొల్లగొట్టాయట. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఓ చైనా వ్యక్తితో పాటు ముగ్గురు భారతీయ నిందితులను అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ గేమ్స్ పేరుతో ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారిలో ఎక్కువగా చైనీస్ ఉన్నారని అధికారులు చెబుతున్నారు.



ఇదిలా ఉంటే లాక్‌డౌన్ కాలంలో ఈ ఆన్‌లైన్ రమ్మీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఆడేవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయిందట. ఇంట్లోనే ఎక్కువగా ఉండడం వల్లో, సామాజిక మాధ్యమాల్లో కనిపించే బోగస్ యాడ్స్ వల్లో ఈ టైమ్‌లో చాలా ఎక్కువగా రమ్మీ యాప్‌లను డౌన్‌లోడ్ చేశారట. ఆడుతున్నారట. డబ్బులు పోగొట్టుకుంటున్నారట.

2021 నాటికి ఆన్‌లైన్ గేమర్స్ 310 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉన్నందున, కంపెనీలు ఆటల రూపకల్పనకు ముందు వినియోగదారుల ఆసక్తిని అర్థం చేసుకుని, రమ్మీ వంటి కార్డ్ గేమ్స్‌ను ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఆన్‌లైన్ రమ్మీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు రమ్మీని వివిధ రకాల బహుమతులతో ఆడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆడేవారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది.



ఇటీవల ఓ మెట్రో నగరానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తి ఓ బ్యాంకులో పనిచేస్తూ.. రూ. కోటి రూపాయల మోసం చేశాడు.. అంత డబ్బులు అతను ఏం చేశాడా? అని ఆరా తీస్తే ఆన్‌లైన్ రమ్మీలో మొత్తం పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విస్తు పోయారు. ఇంకో వ్యాపారి పెద్ద ఎత్తున రుణాలు చేసి పరారయ్యాడు. ఆయన షాపు, ఇళ్లు అమ్మినా అప్పులు తీరలేదు. ఆ వ్యాపారి అప్పులన్నీ కూడా ఆన్‌లైన్‌ రమ్మీ కోసమే తీసుకున్నట్లు గుర్తించారు.
https://10tv.in/sunny-leone-tops-kolkata-colleges-merit-list-actor-says-see-you-all-in-college-next-semester/
ఈ మాయా జూదం వల్ల కోట్ల సంఖ్యలో బాధితులు తయారవుతూ ఉండగా.. ఆన్‌లైన్‌‌లో డబ్బులు నష్టపోతున్న వారు మిస్ అవుతున్న లాజిక్ ఏమిటంటే.. గేమ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ మొత్తం కంపెనీ చేతిలో ఉన్నప్పుడు డబ్బులు ఊరికే ఇవ్వరు కదా? మోసం చెయ్యాలనే చూస్తారు. వచ్చినట్లే అనిపిస్తుంది. కానీ రావు.. రాలేవు.. ఇదంతా డిజిటల్ మాయాజాలం.. జీతాలు ఖాళీ అయ్యి జీవితాలు పోవడం మాత్రం ఖాయం.



స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేయగానే నేను రూ. లక్ష సంపాదించాను.. కారు కొన్నాను. అందుకు కారణం రమ్మీ ఆడడమే అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తాయి. ‘ఆన్‌లైన్‌ రమ్మీ ఆడండి.. ఒక్క ఆటతో లక్షాధికారి కండి’ అంటూ ఊకదంపుడు ప్రకటనలు చూసి ఓసారి ఆడి చూద్దాం అని ఎంట్రీ ఇస్తే ఇబ్బందులు తప్పవు.

వాస్తవాని ఈ ఆటలకు బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. మొదట కొన్ని ఆటలు గెలిచినట్టే అనిపిస్తుంది. కానీ, ఆ తర్వాత వరుసగా ఓడిపోతూ 13ముక్కల వ్యసనం జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ప్రత్యక్షంగా ఆడే రమ్మీ ఆటలో ఒకరు అవుట్‌ అయిపోతే మళ్లీ పందెం కాసి ఆటలో కలవచ్చు. అలా ఎవరు కలుస్తారో ఆడేవాళ్లకు తెలుస్తుంది. కానీ ఆన్‌లైన్‌ రమ్మీలో ఒకరో ఇద్దరో త్వరగా అవుట్‌ అయిపోయి మళ్లీ కలుస్తారు. చివరికి ఆలా కలిసిన వారే ఆట గెలుస్తారు. అదే సాఫ్ట్‌వేర్ టెక్నిక్. అది అర్థం చేసుకోలేక బలైపోతూ ఉంటారు.



ఇక్కడ బాగా చదువుకున్నవాళ్లే ఆడుతున్నారు. వీరి మాయలో ఎక్కువగా పడుతున్నారు. అసలు అటువైపు మనుషులే ఉండరని, కంప్యూటర్లే ఆడతాయని.. అంతా ఆన్‌లైన్‌లో మాయాజాలంతో బురిడీ కొటిస్తారని సైబర్‌ నిపుణులు చెబుతుంటే.. అన్నీ తెలిసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వీరి మాయలో ఎక్కువగా పడడం విశేషం.

‘గేమ్‌ ఆఫ్‌ స్కిల్స్‌’ పేరిట ఆన్‌లైన్‌ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ముంబయి, బెంగళూరు కేంద్రాలుగా ఆన్‌లైన్‌ రమ్మీ సంస్థలు జోరుగా వ్యాపారాలు చేసుకుంటున్నాయి. సాంకేతికంగా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో మోసాలను పోలీసులు నిరూపించడం కూడా కష్టసాధ్యం అవుతుంది. తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలు ఈ రమ్మీ ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించాయి. ఏటా ఈ మాయలో రూ. 7500కోట్లు భారత్‌లో పోగొట్టుకుంటున్నారట.



ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఫెడరేషన్‌ వివరాల ప్రకారం దేశంలో 20కి పైగా సంస్థలు ఆన్‌లైన్‌ రమ్మీ యాప్‌లు నిర్వహిస్తున్నాయి. 2020 జనవరి నాటికి దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నారు. రమ్మీ సంస్థలు అధికారికంగా దాదాపు రూ.2,500 కోట్లు తమ ఆదాయంగా చూపిస్తున్నాయి.