జై భజరంగభళీ…. ప్రపంచంలోనే ఎత్తైన 215 అడుగుల హనుమాన్ విగ్రహం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని కర్ణాటకలోని హంపిలో ఏర్పాటు చేస్తున్నారు. హనుమంతుడి జన్మస్థలం అయిన కిష్కింద నేటి హంపిగా భావిస్తున్నారు. హంపిలో సుమారు 215 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటు చేసిన తరహాలోనే…. కర్నాటకలోనూ హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ట్రస్టు అధిపతిగా గోవిందానంద సరస్వతి స్వామి ఉన్నారు.
అయోధ్యలో సుమారు 225 అడుగుల ఎత్తు ఉన్న రాముడి విగ్రహాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే రాముడి కంటే పది అడుగుల తక్కువ ఎత్తులో 215 అడుగుల ఎత్తులో రాగితో తయారు చేయబడే హనుమంతుడి విగ్రహాన్ని కిష్కింధలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. విగ్రహ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా హనుమాన్ రథయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర దేశంలోని అన్నిరాష్ట్రాల్లో పర్యటించి అయోధ్యలో ముగుస్తుంది. హనుమాన్ విగ్రహ నిర్మాణం కోసం రధయాత్రలో నిధులు సేకరిస్తారు.
రధయాత్రపూర్తి కావడానికి కనీసం మూడేళ్ళు పడుతుందని…అదే సమయంలో కిష్కిందలో పనులు మొదలెడతామని ట్రస్టు సభ్యులు చెప్పారు. కిష్కింధలో విగ్రహ ఏర్పాటు కోసం పది ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయనున్నారు. వచ్చే బడ్జెట్‌లో కర్నాటక సీఎం యెడ్యూరప్ప .. ఈ ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించనున్నారు.
ఈ ఏడాదిజరిగే హనుమాన్ జయంతికి అయోధ్యనుండి 101 సాధువులను ముఖ్య అతిధులుగు ఆహ్వానిస్తున్నారు. రాముడికి హనుమంతుడిది విడదీయరాని బంధం కాబట్టి మేము కూడా ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని నిర్మించాలనుకున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా మహాశివరాత్రి రోజు (ఫిబ్రవరి21) కిష్కింధ(హంపి)లో హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఊరేగింపులు నిర్వహిస్తోంది.
కేంద్ర పర్యాటక శాఖ హంపీని రామాయణ సర్క్యూట్ లో చేర్చాలని యోచిస్తుండగా…రాష్ట్ర ప్రభుత్వం కూడా కిష్కింద అభివృధ్దిపై ఆసక్తి చూపుతోందని ట్రస్ట్ బోర్డు సభ్యులు తెలిపారు. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా ఉన్న హంపిని కూడా తీర్థయాత్ర కేంద్రంగా మారుస్తామని ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.
Read More>>భీష్మ – రివ్యూ