Jharkhand : ప్రేమ జంటను కలిపిన ఇన్‌స్టాగ్రామ్.. ప్రియుడి కోసం పోలెండ్ నుంచి జార్ఖండ్ వచ్చిన మహిళ
ప్రేమకు హద్దులు లేవన్నది నిజం చేస్తున్నాయి కొన్ని ప్రేమ జంటలు.. దేశాల సరిహద్దులు దాటుకుని వచ్చి ప్రేమను గెలిపించుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం ప్రేమగా మారి ప్రియుడి కోసం పోలెండ్ నుంచి జార్ణండ్‌కు వచ్చింది అతని ప్రియురాలు. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

Jharkhand
Jharkhand Man Love Story : ఆన్ లైన్ ప్రేమల గురించి తెలిసిన విషయమే.. అయితే అలా పరిచయం అయిన వ్యక్తి కోసం దేశాలు దాటి మరీ రావడం అంటే ఆశ్చర్యకరమైన విషయం. పోలెండ్‌కి చెందిన బార్బారా.. జార్ఖండ్ బరతువాకి చెందిన మాలిక్ ఆన్ లైన్‌లో ప్రేమలో పడ్డారు. అతనితో కలిసి జీవించేందుకు టూరిస్ట్ వీసాపై ఆమె భారత్‌కి వచ్చేసింది. మరి వీరి ప్రేమ కథ ఎలా మొదలైంది?
ప్రేమకు హద్దులు లేవు అన్న మాటను ఇటీవల కొన్ని ప్రేమ జంటలు నిజం చేస్తున్నాయి. దేశ సరిహద్దులు దాటి మరీ లవ్ బర్డ్స్ ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. ఆన్ లైన్ గేమ్ ఆడుతూ పరిచయం అయిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి పిల్లలతో సహా ఇండియాకు వచ్చేసిన సీమా హైదర్ ప్రేమ కథ.. లూడో గేమ్ ఆడుతూ పరిచయం అయిన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుంచి బెంగళూరులోని తన ప్రేమికుడి దగ్గరకు వచ్చేసిన ఇక్రా కథ విన్నాం. ఇప్పుడు పోలెండ్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ బార్బారా మాలిక్ జార్ఖండ్‌లోని హజరీబాగ్‌లో ఉన్న తన ప్రేమికుడు మాలిక్ కోసం జార్ఖండ్ వచ్చేసింది. ఇక వీరిని ఇన్‌స్టాగ్రామ్ కలిపింది.
బార్బారా, మాలిక్ 2021 లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అంతే పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. బార్బారా 2027 వరకూ చెల్లుబాటు అయ్యేలా టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చింది. వారి పెళ్లి కోసం హజారీబాగ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) కోర్టులో పెళ్లికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. బార్బారాకు గతంలో పెళ్లైంది. భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. అయితే అతని ద్వారా కలిగిన కుమార్తె అనన్య ఉంది. ఆమె కూడా మాలిక్‌ను ‘నాన్న’ అని పిలవడం మొదలుపెట్టిందట.
ఇక బార్బారా, మాలిక్ పెళ్లికి గ్రామంలో సన్నాహాలు మొదలైపోయాయట. తనకి ఇండియా ఎంతో నచ్చిందని, హజారీబాగ్ చిన్న గ్రామమైన మంచి ప్రదేశమని కొనియాడింది. తనను చూడటానికి చాలామంది వచ్చారని.. సెలబ్రిటీల భావించానని తను మాలిక్ కోసం హజారీబాగ్ వచ్చానని.. అతనితో సంతోషంగా ఉన్నానని చెబుతోంది. ఈ ప్రేమ జంట కలకాలం చిలక-గోరింకల్లా ఉండాలని గ్రామస్తులు దీవిస్తున్నారు.