మెడకు బాంబు కట్టి విసిరేయండి: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికలవేళ కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర మినిష్టర్ పంకజ ముండే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భహిరంగ సభలో మాట్లాడిన మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీ నేత పంకజ్ ముండే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మెడకు బాంబు చుట్టి దేశం బయటకు విసిరేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్ వాయు దాడులు జరగలేదంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడంపై మాట్లాడిన పంకజ ముండే ఈమేరకు వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని ఉగ్రవాదం నుంచి విముక్తి చేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ ఆ విషయాన్ని కూడా ప్రశ్నిస్తుందని, మన సైనికులపై దాడి చేస్తే సర్జికల్ దాడులతో తిప్పికొట్టామని ఆమె అన్నారు. ఆధారాలివ్వమని అడుగుతున్న రాహుల్ గాంధీ మెడకు బాంబు చుట్టి వేరే దేశానికి విసిరేయాలని అన్నారు. మీడియా హైప్ తెచ్చుకునేందుకే చాలామంది బీజేపీని విమర్శిస్తున్నారని పంకజా ముండే అన్నారు.
ఇదిలా ఉంటే పంకజా ముండే చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. రాహుల్ మెడకు బాంబు చుట్టి దేశం విసిరేయాలంటూ పంకజ ముండే అనడం బీజేపీ నేతల చవకబారు ఆలోచనలకు ఉదాహరణ అని విమర్శించింది. బీజేపీ నేతల నుంచి తప్ప ఎవరి నుంచి కూడా ఇటువంటి చెత్త వ్యాఖ్యలను చూడలేమని కాంగ్రెస్ ఆరోపించింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కర్కరే లాంటి వారిని దేశద్రోహులుగా చిత్రీకరించిన బీజేపీ వాళ్లు ఎంత దూరమైనా వెళ్లగలరని కాంగ్రెస్ బీజేపీ నేతలకు చురకలు అంటించింది.