మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఒక్కరోజే 25వేలకు పైగా కేసులు నమోదు

మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గురువారం(మార్చి-18,2021)రాష్ట్రంలో కొత్తగా 25,833 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు

Maharashtra మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతుంది. గురువారం(మార్చి-18,2021)రాష్ట్రంలో కొత్తగా 25,833 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. 2021 సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఒక్కరోజే ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం మహారాష్ట్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క నాగ్‌పూర్ జిల్లాలోనే 3,796 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి ప్రజలను ఆందోళనలకు గురిచేస్తోంది.

ఇక, ఆర్థిక రాజధాని ముంబైలో గడచిన 24 గంటల్లో 2,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఎనిమిది మంది కరోనాతో చనిపోయారు. నాగ్‌పూర్, ముంబై తరువాత పుణెలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరోమారు లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తలను ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే కొట్టిపారేశారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడానికి సిద్ధంగా ఉందని.. ముంబైలో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు

ఇక, మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,96,340కు, మరణాల సంఖ్య 53,138కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 21,75,565కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,66,353 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

ట్రెండింగ్ వార్తలు