New GST bikes Prices : కొత్త GST రేట్ల ఎఫెక్ట్.. ఏయే బైక్ ధరలు తగ్గుతాయి.. ఏయేవి పెరుగుతాయి?

జీఎస్టీలో తాజా మార్పుల ప్రకారం.. 350సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు, స్కూటర్లు 18శాతం జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి.

New GST bikes Prices : కొత్త GST రేట్ల ఎఫెక్ట్.. ఏయే బైక్ ధరలు తగ్గుతాయి.. ఏయేవి పెరుగుతాయి?

New GST bikes Prices

Updated On : September 4, 2025 / 11:23 AM IST

GST Reforms : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై జీఎస్టీలో రెండు శ్లాబులు (5శాతం, 18శాతం) మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో 12, 28శాతం స్లాబ్ లు తొలగించాలని నిర్ణయించారు. అయితే, కొన్ని బైక్ లు, కార్లపై 40శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయించారు.

Also Read: GST On Cars : కార్లు కొందామనుకునే వారికి బ్రేకింగ్ న్యూస్.. ఈ కార్లపై 40 శాతం జీఎస్టీ.. లిస్ట్ చెక్ చేయండి..

జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా.. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులు కేవలం 5శాతం, 18 శాతంతో రెండు శ్లాబుల విధానాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ శ్లాబుల ప్రకారం.. కొన్ని వస్తువులు, వాహనాల ధరలు తగ్గనుండగా.. మరికొన్ని వస్తువులు, వాహనాల ధరలు పెరగనున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచే కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. లగ్జరీ కార్లు, కొన్ని రకాల బైకులతోపాటు పొగాకు ఉత్పత్తులు, సిగరేట్లపై ప్రత్యేకంగా 40శాతం శ్లాబును ప్రతిపాదించారు.

జీఎస్టీలో తాజా మార్పుల ప్రకారం.. 350సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు, స్కూటర్లపై 18శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. ఇదివరకు వీటిపై 28శాతం జీఎస్టీ ఉండేది. అంటే.. 100సీసీ, 125సీసీ, 160సీసీ, 200 సీసీ, 250సీసీ, 350సీసీ సామర్థ్యం కలిగిన దాదాపు అన్ని ద్విచక్ర వాహనాల ధరలు తగ్గుతాయి. అయితే, 350సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లపై మాత్రం 40శాతం జీఎస్టీ విధించారు. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ, KTM 390, హార్లే-డేవిడ్‌సన్ వంటి మోడళ్ల ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తాజా జీఎస్టీ సంస్కరణలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఈ సంస్థ 450సీసీ, 650సీసీ విభాగాలలో అనేక బైక్‌లను విక్రయిస్తుంది. 350సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైకులు వాటి ఆన్‌రోడ్ ధరల్లో 10 నుంచి 12శాతం ఎక్కువ పెరుగుదల ఉంటుందని అంచనా.

ఉదాహరణకు రూ.3.6 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ఇప్పుడు రూ.4 లక్షల మార్కును దాటవచ్చు. దీనికి విరుద్ధంగా, 350సీసీ పరిమితిలో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 రూ.2.25 లక్షల నుండి రూ.2.05 లక్షలకు తగ్గే అవకాశం ఉంది.