బీజేపీ వద్ద డబ్బులు తీసుకొన్న ఆ హైదరాబాదీని తిరస్కరించండి : మమత
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Mamata Banerjees Veiled Attack On Owaisi Isf Chief They Are Trying To Divide Hindu Muslim Votes
Mamata Banerjee పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే రెండు దశల్లో 60 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. ఏప్రిల్-6న మూడో దశలో భాగంగా 31 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
శుక్రవారం కూచ్‌బెహర్ జిల్లాలోని దినాహతాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ…ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీని, తనను తరువాత నియంత్రించవచ్చునని, ముందుగా హోంమంత్రి అమిత్ షాను అదుపులో ఉంచాలని ప్రధాని నరేంద్ర మోదీకి దీదీ సూచించారు. ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి తన విజయం ఖాయమని,బీజేపీ నేత సువేందు అధికారికి ఓటమి తప్పదని.. అలాంటప్పుడు వేరొక నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాల్సిన పని లేదన్నారు. అయినా మీ మాటలు వినేందుకు నేనేమైనా బీజేపీ నాయకురాలినా అని ప్రధాని నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నించారు మమత. 200 స్థానాల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలు తమను గెలిపిస్తారని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంఐఎం నేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కూడా మమతాబెనర్జీ విమర్శలు గుప్పించారు. ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి బెంగాల్‌కు వచ్చాడని, అతను బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఆ పార్టీకి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నాడని మమత ఆరోపించారు. ఆ హైదరాబాద్ పార్టీని తిరస్కరించాలని ఓటర్లకు మమత విజ్ణప్తి చేశారు. అసదుద్దీన్ ఓవైసీ పేరును ఆమె నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయనను ఉద్దేశించే మమత ఈ వ్యాఖ్యలు చేసినట్లు సృష్టంగా తెలుస్తోంది. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ISF)చీఫ్ అబ్బాస్ సిద్దిఖీపై కూడా మమత విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్ పార్టీ మరియు హుగ్లీకి చెందిన మాటకారి(అబ్బాస్ సిద్దిఖీ)ఓటర్లకు డబ్బులు పంచి ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని మమత ఆరోపించారు. వాళ్లు ఎన్ని ఆశలు చూపించినా ఏదిఏమైనా ఒక్క ఓటు కూడా చీలిపోకూడదని మమత ఓటర్లకు విజ్ణప్తి చేశారు. వాళ్లు.. హిందూ-ముస్లింల ఓట్లు విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు..అప్పుడు మమతా బెనర్జీ ఏంటీ? హిందువా లేక ముస్లింనా?అని మమత ప్రశ్నించారు.