మానవత్వం పరిమళించే మంచి మనిషి.. విమాన ప్రమాదం జరిగిన చోట 70 తులాల బంగారం దొరికితే తీసుకెళ్లి..
పాత చీరలు, బెడ్ షీట్లు, గన్నీ సంచుల్లోనే మృతులను, తీవ్రంగా గాయపడినవారిని అంబులెన్సుల వద్దకు తీసువెళ్లామని రాజేశ్ తెలిపాడు.

ఇటీవల లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాదస్థలి మృతదేహాలతో నిండిపోయింది. 270 మందికిపైగా ప్రాణాలు పోయిన ఈ ఘటన అందరి గుండెలను తడిపేసింది.
అయితే, అటువంటి పరిస్థితుల్లో ఘటనాస్థలికి పరిగెత్తిన ఓ వ్యక్తి… మానవత్వాన్ని, నిజాయితీని చాటుకున్నాడు. అక్కడ పడిపోయిన హ్యాండ్ బ్యాగులు, దుస్తుల వద్ద 70 తులాల బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయల నగదు, కొన్ని అమెరికా డాలర్లు, పాస్‌పోర్టులు, భగవద్గీత పుస్తకం లాంటి అనేక విలువైన వస్తువులు అతడికి దొరికాయి. వాటిని అన్నింటిని అతడు పోలీసులకు అప్పగించాడు.
Also Read: మీ కల నిజమయ్యే సమయం.. ఈ శాంసంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో అతిపెద్ద ఆఫర్..
అతడి పేరు రాజేశ్ పటేల్. ప్రమాదం జరిగిన సమయంలో అతడు ప్రమాదస్థలికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్నాడు. పేలుడు శబ్దం వినగానే అక్కడ వచ్చాడు. మంటలు ఎంత ఘోరంగా ఉన్నా, అతడు వెనక్కి తగ్గలేదు. అక్కడ మృతదేహాలు ఎవ్వరూ తాకలేని స్థితిలో ఉన్నాయి. అయినప్పటికీ రాజేశ్ పటేల్ సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాడు.
“మొదటి 20 నిమిషాలు మేము దగ్గరికి వెళ్లలేకపోయాం. మంటలు ఎగిసిపడ్డాయి. అవి కాస్త తగ్గాక సహాయక చర్యలు ప్రారంభించాం” అని అన్నాడు.
ప్రమాదం జరగగానే అక్కడకు సాయం చేయడానికి రాజేశ్ వెళ్లిన సమయంలో అక్కడ స్ట్రెచర్లు కూడా లేవు. దీంతో పాత చీరలు, బెడ్ షీట్లు, గన్నీ సంచుల్లోనే మృతులను, తీవ్రంగా గాయపడినవారిని అంబులెన్సుల వద్దకు తీసువెళ్లామని రాజేశ్ తెలిపాడు.
గతంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన రాజేశ్ పటేల్.. 2008 అహ్మదాబాద్ పేలుళ్ల అనంతరం కూడా వాలంటీర్‌గా సేవలందించారట. తన జీవితానుభవాలే ఆయనలో ఈ ధైర్యాన్ని నింపాయేమో. కాగా, మృతులకు సంబంధించిన నగలు, డబ్బును బాధిత కుటుంబాలకు అప్పగించే ప్రక్రియ మొదలైందని పోలీసులు తెలిపారు.