×
Ad

Manipur CM Biren Singh Resign : మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా.. అమిత్ షాను కలిసిన వెంటనే..

జాతుల మధ్య వైరం అల్లర్లకు దారితీసింది. దాదాపు రెండేళ్లుగా ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోతోంది.

Manipur CM Biren Singh Resign : మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ కు సమర్పించారు. కొంతకాలంగా మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్నాయి. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బీరెన్ సింగ్ పనితీరుపైనా అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దలను కలిసిన బీరెన్ సింగ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేశారు.

అల్లర్లతో అట్టుడికిన మణిపూర్..
జాతుల మధ్య వైరంతో కొంతకాలం పాటు మణిపూర్‌ అట్టుడికింది. అల్లర్లను నియంత్రించడంలో బీజేసీ సర్కార్ ఘోరంగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాసానికి సిద్ధమయ్యాయి. ఇంతలోనే బీరెన్‌ సింగ్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు.

Also Read : మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ షాక్.. ఛార్జీలు 50శాతం పెంపు..

ఆదివారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను బీరెన్ సింగ్ కలిశారు. వారితో చర్చించారు. అమిత్ షాతో రెండు గంటల పాటు సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మణిపూర్‌ వెళ్లిపోయిన ఆయన.. నేరుగా గవర్నర్‌ అజయ్ కుమార్ భల్లాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు.

రెండేళ్లుగా రావణకాష్టంలా రగిలిపోయింది..
జాతుల మధ్య వైరంతో మణిపూర్ అట్టుడికిపోతోంది. దాదాపు రెండేళ్లుగా ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోతోంది. హింసాత్మక ఘటనలలో 250 మంది వరకు చనిపోయారు. అల్లర్లను అరికట్టడంలో బీరెన్‌ సింగ్‌ ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపించాయి. అటు సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. హింసను ప్రేరేపించడం వెనుక సీఎం బీరెన్‌ సింగ్‌ హస్తం ఉందనే ఆరోపణలు రావడం కలకలం రేపాయి.

బీరెన్ సింగ్ రాజీనామాతో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా లేక కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తారా అనే అంశంపై ఆయన సంప్రదింపులు జరపనున్నారు. మణిపూర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి బలం ఉన్నప్పటికీ.. అవిశ్వాస తీర్మానంలో తాను నెగ్గుతానే నమ్మకం బీరెన్ సింగ్ కు లేదని తెలుస్తోంది.

Also Read : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి.. రౌండప్ చేసి, కింద కూర్చోబెట్టి, వార్నింగ్ ఇస్తూ.. షాకింగ్ వీడియో..

మణిపూర్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ కు ఐదుగురు, నేషనల్ పీపుల్స్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. జనతా దల్ యుకు ఆరుగురు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. కుకీ పీపుల్స్ అలయన్స్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ బీజేపీకి మద్దతుగా ఉంది.